Poonam Pandey | బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే (Poonam Pandey) మృతి చెందినట్లు శుక్రవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్ (Cervical Cancer)తో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె మేనేజర్ మీడియాకు వెల్లడించారు. అయితే, ఆమె బతికే ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నటి టీమ్ అబద్ధం చెప్పిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. నటి ఇన్స్టాగ్రామ్ నుంచి షాకింగ్ మెసేజ్ వచ్చింది. ‘నేను చనిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాను’ అంటూ పూనమ్ ఓ వీడియో షేర్ చేసింది. తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఆ వీడియోలో వివరించింది.
‘మీ అందరితో ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని నేను భావిస్తున్నాను. అందరూ అనుకున్నట్లు గర్భాశయ క్యాన్సర్ కారణంగా నేను చనిపోలేదు. ఇంకా బతికే ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. కానీ, దురదృష్టవశాత్తూ.. ఈ క్యాన్సర్ వేలాది మంది మహిళల ప్రాణాలను బలిగొందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన లేకపోవడం వల్లే చాలా మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పుకొచ్చింది.
ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా, గర్భాశయ క్యాన్సర్‌ను నివారించవచ్చని వివరించింది. ఈ వ్యాధితో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండే మార్గాలు ఉన్నాయని పేర్కొంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్, వ్యాధిని ముందుగా గుర్తించడం ద్వారా ఈ క్యాన్సర్ నుంచి త్వరగా బయటపడొచ్చని తెలిపింది. కాన్సర్పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతోనే తాను ఇలా చేయాల్సి వచ్చిందని వివరించింది. దీనిపై అందరికీ అవగాహన కల్పిద్దామని పిలుపునిచ్చింది. ప్రస్తుతం పూనమ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Poonam Pandey | పూనమ్ పాండే బతికే ఉందా..? అంతా పబ్లిసిటీ స్టంటేనా..?
Arvind Kejriwal | కేజ్రీవాల్ ఇంటికి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
LK Advani | అద్వానీకి భారతరత్న.. ప్రకటించిన ప్రధాని మోదీ