తమిళ దర్శకుడు విఘ్నేష్‌శివన్, అగ్ర కథానాయిక నయనతార పెళ్లికి సన్నాహాలు చేసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. గత ఐదేళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నారు. విదేశాల్లో షికార్లు చేయడంతో పాటు అనేక వేదికలపై ఈ ప్రేమజంట కలిసి సందడి చేశారు. అయితే ఇప్పటివరకు తమ బంధంపై వారు ఎక్కడా పెదవి విప్పలేదు. శనివారం విఘ్నేష్‌శివన్-నయనతార తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.
వెంకటేశుని సన్నిధిలో వివాహం చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకున్నారని, ముహూర్తపు తేదీని ఖరారు చేసుకునేందుకే తిరుమల విచ్చేశారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. జూన్ 9న ఈ ప్రేమజంట పెళ్లిపీటలెక్కనున్నారని అంటున్నారు . పెళ్లి తేదీకి సంబంధించిన వివరాల్ని విఘ్నేష్‌శివన్, నయనతార త్వరలో ప్రకటిస్తారని తెలుస్తున్నది. విఘ్నేష్‌శివన్ దర్శకత్వం వహించిన ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సినిమాలో నయనతార, సమంత, విజయ్‌సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు.