యాదాద్రి, జూలై 21 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో ఈ నెల 29న ప్రారంభం కానున్న శ్రావణ మాసం కోటి కుంకుమార్చనకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకోవాలని సినీ నటి మంచు లక్ష్మి పిలుపునిచ్చారు. స్వయంభూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని గురువారం ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయంలో నిర్వహించనున్న శ్రావణ లక్ష్మి కోటి కుంకుమార్చన టికెట్‌ను కొనుగోలు చేశారు. అనంతరం మాట్లాడుతూ తన చిన్నతనంలో అమ్మానాన్నలతో కలిసి ఇక్కడకు వచ్చానని, గతంతో పోలిస్తే యాదాద్రి దేవస్థానం మహాద్భుతంగా గుర్తుపట్టలేనంతగా మారిందని అన్నారు.
నూతనాలయంలో సకల వసతులు కల్పించారని, స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉందని తెలిపారు. ఆలయంలో శిల్పకళా, స్వర్ణవర్ణపు విద్యుద్దీపాలు చక్కగా తీర్చిదిద్దారన్నారు. ప్రశాంతంగా స్వామివారి దర్శనమయ్యే విధంగా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మి కోటి కుంకుమార్చన రూ.2వేలతో 30రోజులపాటు గోత్రనామాల పేరిట సంకల్పం చేయడం దేశంలో ఎక్కడాలేదన్నారు. తమ కుటుంబ సభ్యుల పేరిట కోటి కుంకుమార్చన టికెటును స్వీకరించినట్లు వెల్లడించారు.