Actress Kasthuri | ప్రముఖ నటి కస్తూరి కోసం తమిళనాడు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. తమిళనాడులోని తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టు ఆశ్రయించగా.. నటి పిటిషన్ను ఏకసభ్య ధర్మాసనం కొట్టివేసింది. కేసు విచారణలో భాగంగా పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు వెళ్లగా.. ఆమె ఇంటికి తాళం వేసింది. మొబైల్ సైతం స్విచ్ఛాప్లో ఉంది. దాంతో ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు ధ్రువీకరించారు. అయితే, ఆమె ప్రస్తుతం ఏపీలో తలదాచుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలో చెన్నై పోలీస్ కమిషన్ ప్రత్యేక బృందాన్ని ఏపీకి పంపారు. సినీ నిర్మాత ఒకరు ఆమె తమిళనాడు నుంచి తప్పించుకునేందుకు సహాయం చేశారని.. అయితే, ఆ నిర్మాత ఎవరో చెప్పేందుకు చెప్పేందుకు పోలీసు అధికార వర్గాలు నిరాకరించాయి. కస్తూరి 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె పార్టీకి దూరంగా ఉంచుతూ వస్తుంది. కస్తూరి చేసిన వ్యాఖ్యలను ఖండించడంతో పాటు వివరణ ఇచ్చింది. ఈ నెల 3న చైన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి నటి కస్తూరి హాజరయ్యారు. ఈ క్రమంలో మాట్లాడుతూ తమిళ రాజులకు సేవ చేసుకునేందుకు వచ్చిన వారే తెలుగువారంటూ వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్నారు.
300 సంవత్సరాల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు.. ప్రస్తుతం మాది తమిళ జాతి అంటున్నారన్నారు. ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులపై ఆమె మండిపడ్డారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దని.. ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండడంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కస్తూరి క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మహాజన సంఘం రాష్ట్ర సభ్యుడు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.