Anupama Parameswaran | ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ ఆన్లైన్ వేధింపులకు గురైంది. దీంతో ఈ విషయంపై కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది నటి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై ఫిర్యాదు చేయగా.. ఈ విషయం గురించి నటి సంచలన విషయాలను వెల్లడించింది.
కొన్ని రోజుల క్రితం తన దృష్టికి ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా వచ్చిందని అందులో తన గురించి అసత్య ప్రచారం జరుగుతోందని అనుపమ తెలిపారు. ఆ ఖాతాలో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహ నటులను లక్ష్యంగా చేసుకుని పోస్టులు ఉన్నాయని, అంతేకాకుండా మార్ఫింగ్ చేసిన ఫోటోలు కూడా కనిపించాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఆన్లైన్ వేధింపుల కారణంగా తాను తీవ్రంగా బాధపడ్డానని చెప్పారు. ఆ వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తే తనను ద్వేషిస్తూ మరికొన్ని ఫేక్ అకౌంట్లు సృష్టించినట్లు తర్వాత తెలిసిందని అనుపమ తెలిపారు. ఈ ఘటనపై వెంటనే కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అధికారులు వేగంగా స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ చర్యల వెనుక ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించిన తర్వాత ఆ వ్యక్తి గురించి తెలుసుకొని అనుపమ ఆశ్చర్యపోయారు. ఆ వేధింపులకు పాల్పడింది తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల యువతి అని తేలింది. ఆమెది చాలా చిన్న వయసు. తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నేను ఆమె పూర్తి వివరాలు పంచుకోవాలని అనుకోవడం లేదు అని అనుపమ తెలిపారు. అయినప్పటికీ, న్యాయపరంగానే ముందుకెళ్తానని స్పష్టం చేశారు.