అగ్ర హీరో రవితేజ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్‌రాజు (90) మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో కన్నుమూశారు. రాజగోపాల్రాజుకి ముగ్గురు కుమారులు. వారిలో రవితేజ పెద్దవాడు. రెండో కుమారుడు భరత్ 2017లో కారు ప్రమాదంలో మరణించారు. మరో కుమారుడు రఘు సినిమాల్లో నటిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన రాజగోపాల్‌రాజు ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. ఉద్యోగరీత్యా ఆయన ఎక్కువ భాగం ఉత్తర భారతదేశంలో గడిపారు. రవితేజ పాఠశాల విద్య జైపూర్, ఢిల్లీ, ముంబయి, భోపాల్‌లోనే సాగింది. రాజగోపాల్‌రాజు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘సోదరుడు రవితేజ తండ్రి రాజగోపాల్‌రాజు మరణవార్త ఎంతగానో బాధించింది. చివరిసారి ఆయన్ని ‘వాల్తేరు వీరయ్య’ సెట్లో కలిశాను. ఈ కష్ట సమయంలో రవితేజ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నా’ అని చిరంజీవి సంతాప సందేశంలో పేర్కొన్నారు.