Actor Naresh | దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లైట్లు ఆలస్యమవడం, రద్దు కావడంతో ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ కూడా అసౌకర్యానికి గురయ్యారు. హైదరాబాద్ విమానాశ్రయంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. బుధవారం ఉదయం 8:15 గంటలకు ఇండిగో టెర్మినల్‌కు చేరుకున్నానని, అప్పటికే అన్ని విమానాలు ఆలస్యమై గందరగోళ పరిస్థితి నెలకొని ఉందని నరేశ్ తెలిపారు. బోర్డింగ్ గేట్లు మూసివేయబడగా, ఆందోళనలో ఉన్న ప్రయాణికుల గోలతో ఎయిర్పోర్ట్ మారుమోగుతున్న వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు.
“విమాన ప్రయాణాల్లోని ఆనందం 90లతోనే ముగిసిపోయింది. ప్రయాణికులూ, గ్రౌండ్ సిబ్బందీ మాటల యుద్ధంలో పడిపోయారు. మొత్తం పరిస్థితి గజిబిజిగా ఉంది” అని పేర్కొన్నారు. ప్రస్తుత విమాన ప్రయాణాలకంటే 1990ల కాలపు ప్రయాణాలే సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండేవని నరేశ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నటులకు ఇప్పుడు ఎలాంటి ప్రైవసీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “మాస్కులు, సన్‌గ్లాసెస్ వేసుకున్నా కూడా స్కానర్లు నటులను వెంటనే గుర్తించేస్తున్నాయి. టైమ్ మెషీన్ ఉంటే బాగుండును… 90ల రోజులకు వెళ్లిపోయేవాడిని” అని చెప్పుకొచ్చారు.ఇండిగో సాంకేతిక సమస్యల కారణంగా ఇప్పటికే వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, నరేశ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు నటుడు సోనూసూద్ ఇండిగో స్టాఫ్‌కి మద్దతుగా మాట్లాడుతూ వీడియో షేర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. విమానాలు ఆలస్యం కావడం అనేది చాలా నిరాశను కలిగించే విషయం అయినప్పటికీ, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న ముఖాలను కూడా మీరు గుర్తుంచుకోండి. దయచేసి ఇండిగో సిబ్బంది పట్ల దయగా, వినయంగా ఉండండి. నా కుటుంబం కూడా విమానాశ్రయంలో 4-5 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. కానీ, ఇటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ సిబ్బంది నిస్సహాయులు. వారికి ముందుగా షెడ్యూల్స్ గురించి తెలియదు. వారు కేవలం పై అధికారుల నుంచి వచ్చే సందేశాలను మాత్రమే ప్రయాణికులకు అందిస్తున్నారు అని సోనూ సూద్ పేర్కొన్నారు.