Kasthuri | తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో జైలు కెళ్లిన నటి కస్తూరి (actor kasthuri)కి ఊరట లభించింది. చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.
కాగా, ఈ కేసులో కస్తూరిని గత శనివారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఆమెను అదుపులోకి తీసుకుని చెన్నైకు తరలించారు. ఈ కేసులో ఆమెకు చెన్నై ఎగ్మోర్ కోర్టు (Egmore Court) రిమాండ్ విధించింది. ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు పోలీసులు కస్తూరిని చెన్నైలోని ఎగ్మోర్ ఫుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కస్తూరి ఎగ్మోర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి దయాళన్.. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ (conditional bail) మంజూరు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
రీసెంట్గా తమిళనాడులోని రాజకీయపార్టీ ‘హిందూ మక్కల్ కచ్చి’ ఏర్పాటు చేసిన సభలో కస్తూరి ద్రవిడ పార్టీలనుద్దేశించి మాట్లాడుతూ.. ద్రవిడ పార్టీలు బ్రాహ్మణులను పరాయివాళ్లుగా చూడటం సరికాదంటూ.. తెలుగువారి పట్ల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళనాడులోని రాజుల అంతఃపురంలో పని చేసేందుకు వచ్చిన తెలుగువాళ్లను తమిళనాడు స్థానికులుగా భావిస్తూ, బ్రాహ్మణులను మాత్రం పరాయి వాళ్లుగా చూడటం ఏంటని కస్తూరి ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో కస్తూరి వివరణ కూడా ఇస్తూ.. ద్రవిడ పార్టీలు తన వ్యాఖ్యలను వక్రీకరించాయని అన్నారు. తెలుగు ప్రజలను అవమానించడం తన ఉద్దేశం కాదని తెలిపారు. కేవలం బ్రాహ్మణులను పరాయివాళ్లుగా చూడటం ఏంటని ప్రశ్నించానని, అంతేతప్ప తెలుగువారిని కించపర్చలేదని చెప్పుకొచ్చారు. ఈ వివాదం నేపథ్యంలో ఆమెపై పోలీస్ కంప్లెంట్ కూడా ఫైల్ అయ్యింది. దీంతో ఆమె ముందస్తు బెయిల్ కోసం చెన్నైలోని ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించగా.. ఆమె పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీంతో నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరోసారి బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు ఆమెకు రిలీఫ్ కల్పించింది.
Also Read..
AR Rahman | రెహమాన్ – సైరా భాను విడాకుల విషయంలో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు : లాయర్
Bhairavam | భైరవం షూటింగ్ టైం.. కోనసీమలో అదితీశంకర్తో బెల్లంకొండ శ్రీనివాస్
Nayanthara | నయనతార డాక్యుమెంటరీకి నెట్ఫ్లిక్స్ అన్ని కోట్లు చెల్లించిందా..?