AR Rahman | ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (AR Rahman) తన భార్య సైరా భాను (Saira Banu)తో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ఇద్దరూ పరస్పర అంగీకారంతో ముగింపు పలికారు. ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు అయిపోయాక కూడా వీరు విడిపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక రెహమాన్ దంపతులు విడాకులు ప్రకటించిన గంటల వ్యవధిలోనే రెహమాన్ మ్యూజిక్ బృందంలోని బాసిస్ట్ మోహినీ దే (bassist Mohini Dey) కూడా తన భర్తతో విడాకులు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పలు కథనాలు దర్శనమిస్తున్నాయి. రెహమాన్ – సైరా భాను విడాకులకు మోహినికి ఏదైనా సంబంధం ఉందా అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఈ వార్తలపై సైరా తరఫున న్యాయవాది (Saira Banus lawyer) వందనా షా స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ రెండు జంటల విడాకులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. పరస్పర అంగీకారంతోనే రెహమాన్ – సైరా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కాగా, ఏఆర్ రెహమాన్ 1995లో సైరా భానును వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలకు పెళ్లయ్యింది. వైవాహిక బంధంలో ఏర్పడిన భావోద్వేగ క్షణం తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఏఆర్ రెహమాన్ న్యాయవాది తెలిపారు. ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉన్నా.. ఉద్రిక్తలు, ఆందోళనలు వారి మధ్య గ్యాప్‌ను పెంచాయని.. ఆ అగాధాన్ని పూడ్చేందుకు ఎవరు కూడా సిద్ధంగా లేరన్నారు.
ఇక రెహమాన్ జంట విడాకులు ప్రకటించిన గంటల వ్యవధిలోనే మోహినీ దే కూడా తన భర్త మార్క్‌తో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. మోహిని, మార్క్ సంయుక్త ప్రకటనలో పరస్పర అవగాహన ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. అయినా ఇద్దరం మంచి స్నేహితులుగా ఉంటామని.. జీవితంలో భిన్నమైన విషయాలను కోరుకుంటున్నామని పేర్కొన్నారు. మోహిని సైతం డివోర్స్‌పై ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Also Read..
Nayanthara | నయనతార డాక్యుమెంటరీకి నెట్‌ఫ్లిక్స్ అన్ని కోట్లు చెల్లించిందా..?
Shraddha Srinath | నేను చాలా సెలెక్టివ్.. విమర్శలను పట్టించుకోను: శ్రద్ధాశ్రీనాథ్