Shraddha Srinath | ‘సినిమాల ఎంపికలో నేను చాలా సెలెక్టివ్‌గా ఉంటాను. రొటీన్‌కు భిన్నంగా వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యతనిస్తాను. ‘జెర్సీ’ తర్వాత అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులొచ్చాయి. అయినా ఎప్పుడూ బాధపడలేదు. ఈ ప్రయాణంలో నటిగా మరింత పరిణితి సాధించానని భావిస్తున్నా’ అని చెప్పింది శ్రద్ధాశ్రీనాథ్. ఆమె విశ్వక్సేన్ సరసన కథానాయికగా నటించిన ‘మెకానిక్ రాకీ’ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది.
రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను మాయ అనే అమ్మాయిగా కనిపిస్తా. ఇప్పటివరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్. మెకానిక్ రాకీ జీవితంలో మాయ ఎలాంటి మార్పులకు కారణమైందనే అంశం ఆసక్తికరంగా ఉంటుంది.
ఈ కథలో ఊహించని మలుపులు, సర్ప్రైజ్లు ఉంటాయి’ అని చెప్పింది. గతంలో ఓ సారి విశ్వక్సేన్ సినిమాను ఎందుకు రిజెక్ట్ చేశారనే ప్రశ్నకు స్పందిస్తూ ‘అది రీమేక్ మూవీ. నాకు రీమేక్ సినిమాలు చేయడం ఇష్టం ఉండదు. అందుకే నో చెప్పాను. ఈ సినిమాలో విశ్వక్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అతను చాలా ఎనర్జిటిక్. ఎప్పుడూ సరదాగా ఉంటాడు’ అని తెలిపింది.
ఇండస్ట్రీలో తనకు గాడ్‌ఫాదర్స్ ఎవరూ లేరని, హిట్, ఫ్లాప్స్‌ను సమదృష్టితో చూడటం అలవాటు చేసుకున్నానని, విమర్శలను కూడా అంత సీరియస్‌గా తీసుకోనని శ్రద్ధా శ్రీనాథ్ పేర్కొంది. బాహుబలి, కల్కి వంటి పీరియాడిక్ కథల్లో నటించాలన్నది తన డ్రీమ్ అని, ప్రస్తుతం తెలుగులో ‘డాకు మహారాజ్’ చిత్రంలో నటిస్తున్నానని చెప్పింది.