న్యూఢిల్లీ: హాలీవుడ్ నటుడు జీన్ క్లాడ్ వాన్‌డమే(Jean-Claude Van Damme) చిక్కుల్లో పడ్డాడు. 64 ఏళ్ల ఆ స్టార్‌పై రొమేనియాలో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ట్రాఫికింగ్‌కు గురైన మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. మోరెల్ బోలియా అనే క్రిమినల్ నెట్వర్క్ నుంచి స్ట్రీట్ ఫైటర్ ఫిల్మ్ హీరో వాన్‌డమే అయిదుగురు ఆడవాళ్లను గిఫ్ట్‌గా పొందినట్లు తెలుస్తోంది. డైరెక్టరేట్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ఆర్గనైజ్డ్ క్రైం అండ్ టెర్రరిజం(డీఐఐసీఓటీ) వద్ద నటుడు వాన్‌డమేపై రొమేనియా అధికారులు ఫిర్యాదు చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌కు గురైన మహిళలను హీరో వాన్‌డమే గిఫ్ట్‌గా పొందినట్లు అధికారులు ఆరోపించారు.
కేన్స్‌లో వాన్‌డమే ఆర్గనైజ్ చేసిన ఈవెంట్‌లోఈ విషయం తెలిసింది. ఆ నటుడుకు వ్యతిరేకంగా ఓ మహిళ ఫిర్యాదు నమోదు చేసింది. దీంతో డీఐఐసీఓటీ ఈ కేసును విచారిస్తున్నది. ట్రాఫికింగ్‌కు గురైన మహిళలను అమానవీయంగా వాడుకున్నట్లు అటార్నీ ఆడ్రియన్ కుకులిస్ తెలిపారు. ట్రాఫికింగ్‌తో లింకున్న కేసులో అనేక మంది రొమేనియన్లపై విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. ఆ దేశంలో నమోదు అయిన రెండవ హై ప్రొఫైల్ కేసు ఇది. ఆండ్రూ, ట్రిస్టన్ టాటే కూడా ఇటీవల సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.
జీన్ క్లాడ్ వాన్‌డమే.. బెల్జియం దేశానికి చెందిన మార్షల్ ఆర్టిస్టు, నటుడు, నిర్మాత. అనేక చిత్రాలను తీశాడతను. వాన్‌డమే అంటే యాక్షన్‌కు పెట్టింది పేరు. బ్లడ్స్పోర్ట్(1998), కిక్బాక్సర్(1989), యునివర్సల్ సోల్జర్(1992) చిత్రాలో కీలకమైన పాత్రలను పోషించాడు. 1960లో బెల్జియంలో జన్మించాడతను. కరాటే, కిక్‌బాక్సింగ్‌లో అతను శిక్షణ పొందాడు. ఆ తర్వాత 1980 దశకంలో హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ద మసెల్స్ ఫ్రమ్ బ్రసెల్స్ అన్న నిక్‌నేమ్ అతనికి ఉంది. 1990 దశకంలో ప్రధాన హీరోగా అనేక చిత్రాల్లో నటించాడు. మాదక ద్రవ్యాలు వాడినట్లు అతనిపై కేసులు ఉన్నాయి. కొకైన్కు బానిసయ్యాడు. డ్రంక్ డ్రైవింగ్, గృహహింస కేసులో అతన్ని అరెస్టు చేశారు.
టీనేజర్‌గా అతను కరాటేలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. 44 విజయాలు నమోదు చేశాడు. బెల్జియం కరాటే జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 1979లో ఆ జట్టు యురోపియన్ కరాటే చాంపియన్‌షిప్ నెగ్గింది.