TFCC | తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. యాప్స్ వ్యవహారంలో పలువురు నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సైతం ప్రకటన విడుదల చేసింది. కొందరు తెలియక.. మరికొందరు తెలిసే ప్రమోషన్స్ చేస్తున్నారని అభిప్రాయపడింది. సినీ ఇండస్ట్రీకి చెందిన వారైనా.. మరొకరైనా చట్టానికి, న్యాయానికి కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొంది. రెండురోజులు బెట్టింగ్ యాప్ కేసుల వ్యవహారంపై సినీ ఇండస్ట్రీలోనూ చర్చ జరుగుతుందని.. యాప్‌ల కారణంగా సమాజానికి చెడు జరుగుతుంటే.. అది ముమ్మాటికి తప్పేనని.. ఈ విషయంలో రెండురోజుల్లో ‘మా’కు లేఖ రాయనున్నట్లు చెప్పింది. యాప్స్ ప్రమోషన్స్ నిర్వహించే నటీనటులపై చర్యలు తీసుకోవాలని ‘మా’ను కోరనున్నట్లు టీఎఫ్‌సీసీ పేర్కొంది.
ఈ విషయంలో సభ్యులకు అవగాహన కల్పించాలని కోరింది. డబ్బుల కోసం.. రాత్రికి రాత్రే ఫేమ్ అయ్యేందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారని.. వాటిని ప్రోత్సహించడం తప్పని.. సమాజానికి హాని చేసే వాటిపై విచక్షణతో వ్యవహరించాలని సూచించింది. మీకు సెలబ్రిటీ హోదా ఎవరు ఇచ్చారు? ఆ హోదా ఇచ్చినందుకు ప్రజలకు చెడు చేయాలనుకుంటే ఎలా? అని ప్రశ్నించింది. ఈ విషయంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ బాధ్యతగా అవగాహన కల్పిస్తామని.. అయినా యాప్‌ల కోసం ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. చాలా మంది అగ్ర నటీనటులకు పలు సంస్థలు అవకాశాలు ఇచ్చాయని.. రూ.కోట్లు ఆఫర్ చేసినా ప్రచారం చేసేందుకు అంగీకరించలేదని గుర్తు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రోత్సహించడం వల్ల యువత వాటికి బానిసవుతున్నారని.. ఇండస్ట్రీకి చెందిన వారైనా.. యూట్యూబర్స్ అయినా యువత చెడిపోయేందుకు కారకులు కాకూడని టీఎఫ్‌సీసీ అభిప్రాయపడింది.