ఆపరేషన్ సిందూర్.. ఈ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉంది. విన్న ప్రతీ భారతీయుని గుండె.. విజయగర్వంతో ఉప్పొంగిపోతున్నది. అందుకే, ఈ టైటిల్ హక్కుల కోసం భారతీయ సినీ నిర్మాణసంస్థలు పోటీ పడుతున్నాయి. ఇంతకుముందు కూడా.. సర్జికల్ స్ట్రయిక్స్, ఉరీ, ఎల్వోసీ కార్గిల్, ఘాజీ, మేజర్, తేజస్ లాంటి ఎన్నో పేర్లు భారతీయుల మనసులో చెరగని ముద్ర వేశాయి. అందుకే, ఆయా పేర్లతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. రియల్ లైఫ్ హీరోల జీవితాలను వెండితెరమీద సగర్వంగా ఆవిష్కరించాయి. ఈ చిత్రాలు యుద్ధం అంటే ఎలా ఉంటుందో కళ్లకు కట్టాయి. భారత సైనికుల గొప్పదనాన్ని దశదిశలా చాటిన అలాంటి కొన్ని సినిమాల గురించి..
1999లో భారత్ – పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. కొందరు పాకిస్థాన్ సైనికులు మారు వేషాల్లో నియంత్రణ రేఖను దాటి భారత్‌లోకి చొచ్చుకువచ్చారు. కార్గిల్‌లో ఖాళీగా ఉన్న భారత భూ భాగాలను ఆక్రమించారు. అలర్ట్ అయిన భారత్.. ఆపరేషన్ విజయ్ చేపట్టింది. ఇండియన్ ఆర్మీ ఎదురుదాడికి దిగి.. పాకిస్థాన్ సైన్యాన్ని తరిమి తరిమికొట్టింది. ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భారత రక్షణ సిబ్బంది కెప్టెన్ విక్రమ్ బాత్రా, సుబేదార్ యోగేంద్ర సింగ్ యాదవ్, మేజర్ దీపక్ రాంపాల్ జీవితాలతో కార్గిల్ యుద్ధం నేపథ్యంతో ‘ఎల్ఓసీ కార్గిల్’ చిత్రం తెరకెక్కింది. మంచు కొండల్లో భారతీయ సైనికులు చూపిన తెగువ, వారి ధైర్యసాహసాలను వెండితెరపై ఆవిష్కరించింది. సంజయ్ దత్, అయూబ్ ఖాన్, సునీల్ శెట్టి, సైఫ్ అలీఖాన్, అభిషేక్ బచ్చన్ లాంటి అగ్రతారలు నటించిన ఈ చిత్రానికి జేపీ దత్తా దర్శకత్వం వహించారు.
1971లో తూర్పు పాకిస్థాన్ విముక్తి యుద్ధం సందర్భంగా.. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. భారత్‌ను దొంగదెబ్బ తీయడానికి పాకిస్థాన్ నావికాదళం రహస్య మిషన్ చేపట్టింది. భారత నౌకా దళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను నాశనం చేసేందుకు పీఎన్ఎస్ ఘాజీని పంపింది. అయితే, భారతీయ జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ (ఎస్21).. ఘాజీని అడ్డుకొని విశాఖ తీరంలో జలసమాధి చేసింది. ఈ సంఘటన ఆధారంగా ‘ద ఘాజీ అటాక్’ చిత్రం తెరకెక్కింది. భారత సినీ చరిత్రలోనే తొలి అండర్‌వాటర్ వార్ సినిమాగా నిలిచింది. పీఎన్ఎస్ ఘాజీని అడ్డుకోవడానికి సముద్రపు అడుగున భారత నేవీ అధికారులు చేసిన సాహసాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు తెలుగు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, అతుల్ కులకర్ణి, కే మేనన్, తాప్సీ పన్ను, సత్యదేవ్ కీలక పాత్రల్లో మెప్పించారు.
1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో వచ్చిన మరో సినిమా.. బోర్డర్. రాజస్థాన్ థార్ ఎడారిలోని లోంగేవాలా సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణను ఈ చిత్రం కండ్లకు కడుతుంది. భారత్‌కు చెందిన లోంగేవాలా బెటాలియన్‌లో కేవలం 120 మంది సైనికులు మాత్రమే ఉంటారు. వారిపై సుమారు మూడువేల మంది సాయుధులతో కూడిన పాకిస్థాన్ సైన్యం.. ట్యాంకులతో దాడికి దిగుతుంది. మేజర్ కుల్దీప్ సింగ్ చాంద్‌పురి నేతృత్వంలోని భారత సైనికులు.. వారిని ధైర్యంగా ఎదిరించి నిలబడతారు. మేజర్ చాంద్‌పురి తన బలగాన్ని సమర్థంగా వినియోగించుకొని, మరిన్ని భారత బలగాలు వచ్చేంత వరకూ పాకిస్థాన్ దళాన్ని అడ్డుకుంటాడు. వేలమంది సాయుధులు, 20-30 యుద్ధ ట్యాంకులతో వచ్చిన పాకిస్థాన్ ఆర్మీతో కేవలం 120 మంది భారత సైనికులు ధైర్యంగా చేసిన పోరాటాన్ని ‘బోర్డర్’ చిత్రంలో చక్కగా చూపించాడు దర్శకుడు జేపీ దత్తా. ఈ సినిమాలో సన్నీ డియోల్, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా లాంటి బాలీవుడ్ అగ్రనటులు నటించారు.
2008 నవంబర్‌లో దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై దాడిచేసింది పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రమూక. అనేకమంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నది. అలాంటి విపత్కర సమయంలో తన ప్రాణాలు కూడా లెక్కచేయకుండా పోరాడి వీర మరణం పొందాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ‘మేజర్’. టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్.. అడివి శేష్ స్వయంగా ఈ కథను రాసుకోవడంతోపాటు సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో.. మేజర్ సందీప్ బాల్యం నుంచి దేశం కోసం ప్రాణాల్ని అర్పించడం వరకూ కళ్లకు కట్టారు.
దేశభక్తి, ప్రతీకారం, సైనికుల త్యాగం నేపథ్యంలో మరెన్నో సినిమాలు తెరకెక్కాయి. దేశ త్రివిధ దళాల ధైర్యాన్ని, వీరత్వాన్ని చాటిచెప్పాయి. 1971, ఐబీ71, తేజస్, ఫైటర్, వీర్ జరా, హిందుస్థాన్ కీ కసమ్, గుంజన్ సక్సెనా: ద కార్గిల్ గర్ల్, పిప్పా, షేర్షా లాంటి మరెన్నో సినిమాలు వెండితెర మీద అలరించాయి. ప్రేక్షకులను మెప్పించడంతోపాటు బాక్సాఫీస్ వద్ద విజయాలనూ అందుకున్నాయి.
2016లో జమ్మూ కశ్మీర్‌లోని ఉరీ సెక్టార్లో ఉన్న భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. 19 మంది భారతీయ జవాన్ల ఉసురుతీశారు. దీనికి ప్రతిగా.. భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ చేపట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వెళ్లి ఉగ్రమూకల పనిపట్టింది. టెర్రరిస్టులకు భారత ఆర్మీ దెబ్బను రుచి చూపించింది. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ ఆధారంగానే ‘ఉరీ: ద సర్జికల్ స్ట్రయిక్’ చిత్రం తెరకెక్కింది. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, పరేష్ రావల్, యామీ గౌతమ్, కీర్తి కుల్హరి ముఖ్య పాత్రలు పోషించారు. మేజర్ విహన్ శెర్గిల్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం రెక్కీ ఆపరేషన్, ప్లానింగ్‌తోపాటు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం, ఈ మిషన్ వెనక ఉన్న మిలిటరీ సన్నద్ధతను ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించారు.
…? చిల్ల శ్రీనివాస్