Abhishek – Aishwarya Rai | బాలీవుడ్ ప్రముఖ దంపతులు ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఐశ్వర్యకు సంబంధించిన ఫోటోలు, డీప్‌ఫేక్ వీడియోలు, అనుచిత కంటెంట్ ప్రచారం అవుతున్నందున, గూగుల్, యూట్యూబ్ వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై రూ.4 కోట్లు పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఐశ్వర్య రాయ్ తన అనుమతి లేకుండా ఫొటోలు వాడుతున్నారని పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఆ తర్వాత కూడా “AI Bollywood Ishq” అనే ఒక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఐశ్వర్యపై 259 కంటే ఎక్కువ డీప్‌ఫేక్ వీడియోలు ప్రచారంలోకి వచ్చాయని, వీటివల్ల ఆమె గౌరవం, వ్యక్తిగత హక్కులు, ఆర్థికపరమైన ప్రతిష్ఠకు నష్టం వాటిల్లిందని దంపతులు వాదించారు.
ఈ వ్యవహారంలో కోర్టు ముందుగా ఇచ్చిన ఉత్తర్వుల్లో.. గుర్తించిన వీడియోల URL లను 72 గంటల్లో తొలగించాలని గూగుల్, యూట్యూబ్ వంటి సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను సకాలంలో అమలు చేయకపోవడంతోనే ఈ దంపతులు మళ్లీ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ కేసు నేపథ్యంలో భారతదేశంలో పర్సనాలిటీ రైట్స్, AI డీప్‌ఫేక్ దుర్వినియోగం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల బాధ్యత వంటి అంశాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవలే గాయని ఆషా భోస్లే తన వాయిస్‌ను ఎఐ ద్వారా క్లోన్ చేయడంపై బాంబే హైకోర్టు జోక్యం చేసుకోగా, అక్కినేని నాగార్జున సైతం తన పేరును అనధికారికంగా వాడకుండా ఉండేలా ఢిల్లీ హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు.
ఐశ్వర్య-అభిషేక్ దంపతులు దాఖలు చేసిన ఈ తాజా కేసు సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు న్యాయ పరిరక్షణ లభించేందుకు మార్గం సుగమం చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. AI టెక్నాలజీ వృద్ధి చెందుతున్న ఈ యుగంలో వ్యక్తుల గౌరవం, హక్కుల పరిరక్షణకు ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ఇక కొద్ది కాలంగా అభిషేక్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ల విడాకులకి సంబంధించిన వార్తలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తాయి. కాని అవి అన్నీ కూడా ఫేక్ అని తేలిపోయింది.