ముంబయిలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్‌లో పాల్గొన్న అగ్ర నటుడు అమీర్‌ఖాన్ భారతదేశంలో థియేటర్ వ్యవస్థపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. మన దేశ జనాభాకు ఇప్పుడున్న థియేటర్ల కంటే నాలుగింతల థియేటర్లు అవసరమవుతాయని అభిప్రాయపడ్డారు. ‘140కోట్ల జనాభాకు కేవలం 10వేల థియేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదే 40కోట్ల జనాభా కలిగిన అమెరికాలో 40 వేల స్క్రీన్స్ ఉన్నాయి. చైనాలో లక్ష వరకు స్క్రీన్స్ ఉన్నాయి.
ఇండియాలో పదివేల థియేటర్లలో సగం దక్షిణాదిలోనే ఉన్నాయి. అందుకే వసూళ్ల విషయంలో చాలా సినిమాలు వెనకబడుతున్నాయి’ అని అమీర్‌ఖాన్ అన్నారు. రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన చిత్రాలను కేవలం మూడుకోట్ల మంది మాత్రమే వీక్షించారని, మన జనాభాలో వారు కేవలం రెండు శాతం మాత్రమేనని, మిగతా 98 శాతం మంది థియేటర్లకు ఎందుకు దూరంగా ఉంటున్నారో ఆలోచించాలని అమీర్‌ఖాన్ అభిప్రాయపడ్డారు. ఉత్తరాదిలోని చాలా జిల్లాల్లో సింగిల్ థియేటర్ లేని పరిస్థితి ఉందని, దీనిలో మార్పు వస్తేనే దేశంలో సినిమాకు మరింత ఆదరణ లభిస్తుందని అమీర్‌ఖాన్ చెప్పారు.