భారతీయ పురాణేతిహాసం ‘మహాభారతం’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్‌ఖాన్ అనేక సందర్భాల్లో వెల్లడించారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా తాలూకు ప్రకటన ఉంటుందని అన్నారు. తాజా ఇంటర్వ్యూలో ‘మహాభారత’ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు అమీర్‌ఖాన్. మహాభారతం అనేక తరాలుగా భారతీయుల సంస్కృతిలో మమేకమైపోయిందని, భావోద్వేగాలపరంగా అదొక మహోన్నతమైన కావ్యమని అమీర్‌ఖాన్ కొనియాడారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై ఆచితూచి అడుగులు వేస్తున్నానని, అన్నీ పక్కాగా కుదిరిన తర్వాతే ముందుకెళ్తానని చెప్పారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘మహాభారతం’ నా చిరకాల స్వప్నం. ఎప్పటికైనా ఆ కలను నెరవేర్చుకుంటా. అదొక గొప్ప బాధ్యత. మహాభారతం భారతీయుల రక్తంలో ఇమిడిపోయింది. భగవద్గీత, మహాభారతం చదవని భారతీయులు ఎక్కడా కనిపించరు. ఏదో ఒకరోజు భారతీయులందరూ గర్వించేలా ‘మహాభారతం’ను వెండితెర దృశ్యమానం చేస్తా. హాలీవుడ్లో లార్డ్ ఆఫ్ ది రింగ్స్, అవతార్ వంటి భారీ సినిమాలొచ్చాయి. వాటన్నింటికి మహాభారతం అమ్మలాంటిది’ అని అన్నారు. గత ఏడాది ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహాభారతం తన చివరి చిత్రమని, ఈ ప్రాజెక్ట్ కోసం సర్వశక్తులు ధారపోస్తానని అమీర్‌ఖాన్ పేర్కొన్నారు.,