Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఇటీవలి కాలంలో చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ‘లాల్ సింగ్ చద్దా’ ఘోర పరాజయం చవిచూడగా , ఆ తర్వాత వచ్చిన ‘సీతారే జమీన్ పర్’ విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ, కమర్షియల్‌గా అంత సక్సెస్ కాలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమిర్ ఖాన్ మరోసారి తన మార్క్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.. ఆమిర్ ఖాన్ తాజాగా తీసుకున్న నిర్ణయం బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. తాజా సమాచారం మేరకు, ఆయన వాస్తవ జీవిత ఘటన ఆధారంగా కొత్త సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు.
ఈ కేసులోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మిస్టరీ, భావోద్వేగాలు ఆమిర్‌ను విపరీతంగా ఆకర్షించాయని సమాచారం. కథ ప్రకారం, రాజా రఘువంశీ అనే వ్యక్తి హనీమూన్ కి వెళ్లగా అక్కడ అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. మర్డర్ వెనుక అతడి భార్య సోనమ్ పాత్రపై అనేక అనుమానాలు కలుగుతాయి. ఈ మిస్టరీని స్క్రీన్‌పై ఆసక్తికరంగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నాడట ఆమిర్. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై ఆయన బృందం ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. గతంలో ఆమిర్ ఖాన్ ‘తలాష్’ అనే సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్ చేశాడు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో, నిజ ఘటనల ఆధారంగా సినిమాని ప్లాన్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఎమోషన్‌తో పాటు థ్రిల్ కూడా కోరుకునే ప్రేక్షకులకు ఇది మంచి ట్రీట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ క్రైమ్ థ్రిల్లర్‌తో పాటు, ఆమిర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ స్క్రిప్ట్‌పై కూడా పని చేస్తున్నట్లు టాక్. అలాగే, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో తెరకెక్కుతున్న రజినీకాంత్ ‘కూలీ’ చిత్రంలో అతను కీలక పాత్రలో కనిపించనున్నాడట. ఈ సినిమా ఆగస్ట్ 14న విడుదల కానుంది. కాగా, ఈ సారి సాలిడ్ కంటెంట్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టాలని ఆమిర్ ఖాన్ ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. నిజ జీవిత సంఘటనను పక్కా ప్లాన్‌తో తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న ఈ స్టార్ హీరో ఈ సారైన కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తాడా లేదా అనేది చూడాలి.