Sitaare Zameen Par | బాలీవుడ్ అగ్రనటుడు ఆమిర్ ఖాన్ వరుసగా ప్రమోషన్స్‌లో పాల్గోంటున్న విషయం తెలిసిందే. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సితారే జమీన్ పర్ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమిర్ మాట్లాడుతూ.. పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా ‘పీకే’ సినిమా సమయంలో తలెత్తిన ‘లవ్ జిహాద్’ ఆరోపణలు, తన దేశభక్తిపై వస్తున్న విమర్శల గురించి ఆయన వివరణ ఇచ్చారు. అన్ని మతాంతర వివాహాలను ‘లవ్ జిహాద్’ కోణంలో చూడటం సరికాదని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. “రెండు మతాలకు చెందిన వారు ప్రేమించుకుని, వివాహం చేసుకుంటే అది అన్నిసార్లు లవ్ జిహాద్ కాదు. ఒకరినొకరు ఇష్టపడి మనుషులుగా ఒక్కటయ్యారు. అది మతాలకు అతీతం అని ఆయన అభిప్రాయపడ్డారు.
తన కుటుంబంలో కూడా ఇలాంటి వివాహాలు జరిగాయని ఆమిర్ గుర్తుచేశారు. “మా అమ్మాయి ఐరా.. నుపుర్ శిఖరే అనే హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నా సోదరి నిఖత్.. సంతోష్ హెగ్డేను, చిన్న సోదరి ఫర్హాన్.. రాజీవ్ దత్త్ను వివాహం చేసుకున్నారు” అని తెలిపారు. ఈ ఉదాహరణలను బట్టి ప్రేమకు మతం అడ్డుకాదని, తమ కుటుంబంలో అన్ని మతాలను గౌరవిస్తామని పరోక్షంగా తెలియజేశారు.
అలాగే ‘పీకే’ సినిమా ఏ మతానికి వ్యతిరేకం కాదని, మతం పేరుతో అమాయకులను మోసం చేసే వ్యక్తుల గురించి మాత్రమే ఆ చిత్రంలో చూపించామని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. “మతం పేరుతో ప్రజలను దోపిడీ చేసే, తప్పుడు బోధనలు చేసే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలనేదే మా ఉద్దేశ్యం. ఏ మతాన్ని కించపరిచే ఉద్దేశ్యం మాకు లేదు” అని ఆయన వివరించారు.
Read More