కొడంగల్ : కాంగ్రెస్ ( Congress ) చేతకాని పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని, బీఆర్ఎస్ ( BRS) ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి (Patnam Narender Reddy) తెలిపారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని దుద్యాల మండలంలోని గౌరారం గ్రామం చాంద్‌పాషా ఫాంహౌస్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే రేవంత్‌కు రైతులపై ఎనలేని ప్రేమ గుర్తుకు వచ్చిందని దుయ్యబట్టారు. ప్రస్తుతం రైతు భరోసా నగదు జమ వేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎంపీ ఎన్నికల్లో రైతుభరోసాను విడుదల చేస్తే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని 9 రోజుల్లో రూ. 9వేల కోట్ల రైతు భరోసాను విడుదల చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలకు భరోసా పోయిందని గ్రహించిన రేవంత్ సీఎం సీటును కాపాడుకునే దిశగా ఎన్నికల స్టంట్‌గా రైతుభరోసాను అందిస్తున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత పాలనను ప్రజలు గుర్తిస్తున్నారని, ఎన్ని ఎత్తులు వేసినా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తప్పదన్నారు. సీఎంగా ఎన్నికై చేతకాని పాలనతో రేవంత్ రెడ్డి కొడంగల్ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతిగ్రామంలోను బీఆర్ఎస్ జెండా ఎగురనుందని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కొడంగల్ ప్రాంతానికి 1లక్ష50వేల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా 90శాతం పనులు పూర్తి చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో కొడంగల్, బొంరాస్‌పేట, దుద్యాల మండలాల బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దామోదర్‌రెడ్డి, చాంద్‌పాషా, కోట్ల యాదగిరి, మాజీ జెడ్పీటీసీ కోట్ల మహిపాల్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మధుసూదన్‌రావు యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్‌బాబుతో పాటు బీఆర్ఎస్ నాయకులు బాబర్, నరేష్, లగచెర్ల సురేష్, మడిగె శ్రీను, రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.