Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి తన శారీరక మార్పుతో చర్చనీయాంశంగా మారారు. ఈసారి సినిమా పాత్ర కోసం కాదు, పూర్తిగా ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన ఈ ట్రాన్స్ఫర్మేషన్ సాధించినట్లు వెల్లడించారు. కఠినమైన వర్కౌట్స్ లేదా జిమ్ రూటీన్స్ కాకుండా, ప్రత్యేకంగా రూపొందించిన యాంటీ-ఇన్ఫ్లమేటరీ డైట్ ద్వారా ఆయన ఏకంగా 18 కిలోల బరువు తగ్గారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ, ఈ మార్పు తాను ఊహించనంత సహజంగా జరిగిందని తెలిపారు. మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు మొదలుపెట్టిన ఈ డైట్, బరువు తగ్గడంలో కూడా అద్భుత ఫలితాలు ఇచ్చిందని చెప్పారు. “ఇది ప్లాన్ చేసిన వెయిట్ లాస్ కాదు. ఆరోగ్యం కోసం చేసిన ప్రయత్నమే ఈ మార్పుకు కారణం” అని ఆమిర్ స్పష్టం చేశారు.
ఆమిర్ మాట్లాడుతూ.. ఈ డైట్ పాటించడం వల్ల కేవలం బరువు తగ్గడమే కాదు, చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న మైగ్రేన్ సమస్య కూడా తగ్గిందట. రోజువారీ జీవనశైలిలో ఎనర్జీ లెవల్స్ మెరుగుపడ్డాయని, శరీరం మరింత లైట్‌గా ఫీలవుతున్నట్లు తెలిపారు. దీంతో ఈ డైట్ తనకు నిజంగా లైఫ్‌స్టైల్ చేంజర్‌గా మారిందని అన్నారు. ఆమిర్ ఖాన్ శారీరక మార్పులు కొత్తేమీ కాదు. గతంలో ‘దంగల్’ సినిమా కోసం మహావీర్ సింగ్ ఫోగట్ పాత్రలో కనిపించడానికి ఆయన ఏకంగా 30 కిలోలు పెరిగి 98 కిలోల వరకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఫిట్ అవడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మరోసారి, అయితే ఈసారి పూర్తిగా ఆరోగ్య కోణంలో చేసిన మార్పు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
సినిమాల విషయానికి వస్తే, ఆమిర్ ఖాన్ ప్రస్తుతం పూర్తి స్థాయి రీ-ఎంట్రీకి తొందరపడటం లేదు. తన మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి తెరకెక్కుతున్న ‘హ్యాపీ పటేల్’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. “ఇది నా పూర్తి కమ్‌బ్యాక్ కాదు” అని ఆమిర్ స్పష్టం చేశారు. ఇటీవల ‘హ్యాపీ పటేల్’ ప్రీమియర్‌కు ఆమిర్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఇరా ఖాన్, జునైద్ ఖాన్, కిరణ్ రావు సహా ఆయన కుటుంబమంతా ఈ కార్యక్రమంలో కనిపించారు. వీర్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ ఖాన్, మోనా సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.