‘మన పురాణాల్లో ‘శంబాల’కు ప్రాధాన్యత ఉంది. ఈ టైటిల్ వినగానే ఎైగ్జెట్ అయ్యాను. ఈ కథ విన్న కొన్ని రోజులకే ‘కల్కి 2898ఏడీ’ విడుదలైంది. ఆ తర్వాత ‘శంబాల’ పేరు మరింత ఎక్కువగా ట్రెండ్ అయ్యింది. నా కెరీర్లో ఇంత బజ్ వచ్చిన సినిమా ఇదే. ప్రచార చిత్రాలకే విపరీతమైన స్పందన కనిపిస్తుంది. ఈ సారి విజయం పక్కా అనే కాన్ఫిడెంట్‌తో ఉన్నాను.’ అని హీరో ఆది సాయికుమార్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘శంబాల’.
యుగంధర్ ముని దర్శకుడు. రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్‌రెడ్డి నిర్మాతలు. ఈ నెల 25న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ‘ఈ సినిమాకు యాక్షన్ సీక్వెన్సే హైలైట్. ఫైట్ కొరియోగ్రాఫర్ రాజ్‌కుమార్ రిహార్సిల్స్ చేయించి మరీ ఈ ఎపిసోడ్స్ తీశారు.
దర్శకుడు యుగంధర్‌తోపాటు కలిసి ఆయన ట్రావెల్ చేశారు. ముఖ్యంగా ైక్లెమాక్స్ కన్నులకు విందులా ఉంటుంది. 80ల్లో కథ కాబట్టి ఆహార్యం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాం. ఇందులో వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండవ్. ఉన్నంతలో మాత్రం అద్భుతంగా వచ్చాయి. ఇందులో పాటలు కూడా ఉండవ్. ఆర్ఆర్ మాత్రం అదిరిపోతుంది.
శ్రీచరణ్ పాకాల తన మ్యూజిక్‌తో సినిమాను మరో స్థాయిలో నిలబెట్టారు.’ అని తెలిపారు ఆది సాయికుమార్. ఆడియన్స్‌కి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదని, నిర్మాతలు ఏ విషయంలోనూ రాజీ పడకుండా భారీ ఎత్తున సినిమాను నిర్మించారని, దర్శకుడు యుగంధర్ ముని పాషన్‌తో సినిమా తెరకెక్కించారని, సినిమా విషయం సంతృప్తిగా ఉన్నామని, త్వరలో హిందీలోనూ విడుదల చేస్తామని ఆది చెప్పారు.