బాలీవుడ్ తార యామీ గౌతమ్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అయ్యింది ‘ఏ థర్స్ డే’. ఈ చిత్రంలో ఆమె టీచర్ నైనా జైస్వాల్ పాత్రలో కనిపించింది. బెహజాద్ కంబక్త దర్శకత్వం వహించారు. ఓ టీచర్ తన దగ్గర ట్యూషన్‌కు వచ్చే పిల్లలను కిడ్నాప్ చేయడం ఈ చిత్రంలో టర్నింగ్ పాయింట్. తన భర్త సహా పిల్లల్ని బందీలుగా తీసుకుని ప్రధానమంత్రిని కలవాలనే కండీషన్ పెడుతుంది. ఆ తర్వాత కథలో చోటుచేసుకునే అంశాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయి.
ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన ఉన్నట్లు చిత్రబృందం నుంచి సమాచారం అందుతున్నది. ఈ సినిమా గురించి యామీ స్పందిస్తూ…‘ఎన్ని సినిమాల్లో నటించినా మర్చిపోలేని చిత్రాలు కొన్ని ఉంటాయి. నా నట ప్రయాణంలో ఏ థర్స్ డే అలాంటి చిత్రమే. ఈ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు అందులోని పాత్రలన్నీ నా ముందు కూర్చుని సంభాషిస్తున్న అనుభూతి కలిగింది. నటిగా నాకున్న అర్హతకు మించిన అవకాశం ఇది అనిపించింది. ఇలాంటి సినిమా సీక్వెల్ చేయాల్సివస్తే సంతోషంగా అంగీకరిస్తా’ అని చెప్పింది.