Salman Khan | బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు హల్చల్ చేశారు. ముంబైకి సమీపంలో గల పన్వేల్ ( Panvel) ప్రాంతంలోని సల్మాన్‌కు చెందిన అర్పితా ఫామ్ హౌస్ (Arpita Farm House)లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పన్వేల్ పోలీసులు ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. జనవరి 4వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఇద్దరు నిందితుల్ని అజేశ్ కుమార్ ఓంప్రకాశ్ గిల్, గురుసేవక్ సింగ్ తేజ్సింగ్గా గుర్తించారు.
ముందు ఫామ్‌హౌస్ వద్దకు వచ్చిన ఆ ఇద్దరు కంచెను ఆనుకుని ఉన్న చెట్టు ఎక్కి సల్మాన్ ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అయితే, తాము సల్మాన్ ఖాన్ అభిమానులమని, ఆయనను కలిసేందుకు ముంబై నుంచి వచ్చినట్లు సెక్యూరిటీకి చెప్పారు. ఈ మేరకు వారు తప్పుడు పేర్లు, ఫేక్ ఆదార్కార్డులను సెక్యూరిటీకి చూపించారు. వారిపై అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుల నుంచి నకిలీ అదార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ‘న్యూ పన్వేల్ ప్రాంతంలోని అర్పితా ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులపై పన్వేల్ రూరల్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఘటనపై తదుపరి విచారణ జరుగుతోంది’ అని ఇన్స్పెక్టర్ అనిల్ పాటిల్ తెలిపారు.
కాగా, సల్మాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వై ప్లస్ భద్రతను కల్పిస్తున్న విషయం తెలిసిందే. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులకు చెందిన ప్రొటెక్షన్ బ్రాంచ్ సల్మాన్ భద్రతను ఎక్స్ కేటగిరీ నుంచి వైప్లస్కు పెంచారు. భద్రత పెంపుతో సల్మాన్ వెంట నిత్యం ఇద్దరు సాయుధ గార్డులు ఉంటారు. మరోవైపు సల్మాన్ ఇంటి వద్ద రోజంతా ఇద్దరు గార్డులు పహారా కాస్తుంటారు.
Also Read..
Elon Musk | డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన ఎలాన్ మస్క్.. ఇంతకీ ఏమన్నారంటే
Ayodhya Ram Mandir | రాత్రి సమయంలో రామ మందిరం ఇలా ఉంటుంది.. ఫొటోలు షేర్ చేసిన ట్రస్ట్