సినీ నటుడు నాని కితాబు
యాదాద్రి, నవంబర్ 10 : గతంతో పోలిస్తే యాదాద్రి ప్రధానాలయం మహాద్భుతంగా రూపుదిద్దుకున్నదని సినీ నటుడు నాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి ఆలయాన్ని ఎంతో చక్కగా పునర్నిర్మించిందని కితాబిచ్చారు. గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. మొదటగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని, స్వామివారి సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనంలో పాల్గొన్నారు. పూర్తి కృష్ణశిలలతో నిర్మితమైన స్వామివారి ఆలయం చరిత్రలో నిలిచిపోనున్నదని చెప్పారు. ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ భాగస్వాములైన వైటీడీఏ అధికారులు, ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి, ప్రధాన స్తపతి, ఉపస్తపతులు, శిల్పులు, ఆలయ అధికారులకు అభినందనలు తెలిపారు.