Zomato UPI | ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato) సైతం యూపీఐ (UPI) సేవలను ప్రారంభించింది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి జొమాటో ఈ యూపీఐ సేవలు తన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి నుంచి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే వినియోగదారులు.. జీ-పే, ఫోన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ తో నిమిత్తం లేకుండా నేరుగా జొమాటో నుంచే పే చేయవచ్చు. అయితే, ఇందుకోసం వారు ప్రత్యేకంగా యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవాలి.
తమకు ఫుడ్ ఆర్డర్ చేస్తున్న కస్టమర్లు చాలా మంది యూపీఐ సేవల ద్వారా పేమెంట్స్ చేస్తున్నారని జొమాటో అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అందువల్లే ఐసీఐసీఐ బ్యాంకు సాయంతో తమ యూజర్లకు యూపీఐ సేవలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. అదే టైంలో క్యాష్ ఆన్ డెలివరీ సర్వీస్ తీసివేయాలని జొమాటో భావిస్తున్నట్లు సమాచారం. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్న కస్టమర్.. ఫుడ్ తిరస్కరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పూర్తిగా రద్దు చేయాలని జొమాటో యోచిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే యూపీఐ సేవల్లో ఫోన్ పే, జీ-పే, పేటీఎంలదే ప్రధాన వాటా.. అందుకే ఆయా యాప్స్ మీద ఆధార పడటం తగ్గించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తలపోస్తున్నది. ఏ కంపెనీ కూడా 30 శాతానికి పైగా వాటా పొందకుండా చూడాలని నిర్ణయించుకున్నది. ఈ క్రమంలోనూ జీ-పే, ఫోన్ పే వంటి యాప్స్ మీద ఆధార పడటం తగ్గించడానికి వేర్వేరు సంస్థలకు యూపీఐ సేవలను ప్రారంభించేందుకు ఎన్పీసీఐ అనుమతులు ఇస్తున్నది. ఇదిలా ఉంటే ఫ్లిప్ కార్ట్ కూడా జొమాటో తరహా యూపీఐ సేవలను త్వరలో ప్రారంభిస్తుందని తెలుస్తున్నది.