Zomato | ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వరుసగా రెండో త్రైమాసికంలో లాభాలు గడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) రెండో త్రైమాసికం నికర లాభం రూ.36 కోట్లు పెరిగిందని పేర్కొంది. 2022-23 రెండో త్రైమాసికంలో రూ.251 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొదటిసారి రూ.2 కోట్ల నికర లాభం పొందింది. 2008లో స్థాపించిన తర్వాత జొమాటో లాభాలు గడించడం ఇదే తొలిసారి.
రెండో త్రైమాసికంలో ఆపరేషన్ల ద్వారా జొమాటో ఆదాయం 71 శాతం పెంచుకుని రూ.2848 కోట్ల రెవెన్యూ పొందింది. గతేడాది రూ.1,661 కోట్లు మాత్రమే. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.2416 కోట్ల ఆదాయం సంపాదించింది.
నిర్వహణాపరంగా జొమాటో రూ.47 కోట్లు నష్టపోయింది. గతేడాది రెండో త్రైమాసికంలోనూ నిర్వహణలో రూ.312 కోట్ల మేరకు నష్టపోయింది. వరుసగా రెండో త్రైమాసికంలో లాభం పొందడంతో శుక్రవారం జొమాటో షేర్ 9.62 శాతం లబ్ధితో రూ.117.90 వద్ద ముగిసింది.