Income Tax | వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్లో ప్రకటించిన నూతన ఆదాయం పన్నుశ్లాబ్ల ప్రకారం సుమారు కోటి మంది వేతన జీవులకు లబ్ధి చేకూరనున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. నూతన ఆదాయం పన్ను విధానం కింద కొత్త ఆదాయం పన్ను శ్లాబ్‌లు ప్రకటించారు. శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడతూ ‘బడ్జెట్ ప్రకటించిన తర్వాత కోటి మంది ప్రజలు ఆదాయం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.
కేంద్ర బడ్జెట్ 2025లో ఆదాయం పన్ను చట్టం 87ఎ సెక్షన్ ప్రకారం నిర్మలా సీతారామన్ పన్ను రాయితీ పెంచారు. సవరించిన కొత్త ఆదాయం పన్నువిధానంలో ఆదాయం పన్ను శ్లాబ్‌ల ప్రకారం రూ.12 లక్షల వరకూ నికర పన్ను ఆదాయం (Net Taxable Income) పై పన్ను చెల్లించనవసరం లేదు. ఇంతకు ముందు రూ.7 లక్షల వరకూ జీరో టాక్స్ విధానం అమలైంది.
వేతన జీవులకు రూ.75 వేల వరకూ స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ లభిస్తుంది. ఒకవేళ వారి స్థూల పన్ను ఆధారిత ఆదాయం రూ.12.75 లక్షల్లోపు ఉంటే రూ.75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కింద మినహాయింపు పొందొచ్చు. నూతన/ పాత ఆదాయం పన్ను విధానంలో ఇది వర్తిస్తుంది.