ముంబై : యూట్యూబ్ ఇండియా క్రియేటర్స్ 2020లో దేశ జీడీపీకి ఏకంగా రూ 6800 కోట్లు సమకూర్చారని, వీరి ద్వారా 6,83,900 ఫుల్‌టైమ్ జాబ్‌ల తరహాలో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ నివేదిక వెల్లడించింది. 40,000కు పైగా యూట్యూబ్ ఛానెల్స్ 45 శాతం వార్షిక వృద్ధితో 1,00,000కు పైగా సబ్స్క్రైబర్లను సాధించాయని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. 2020లో ఆరంకెల రాబడిని సాధించిన యూట్యూబ్ ఛానెల్స్ సంఖ్య 60 శాతానికి పెరిగిందని వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా నూతన ఆడియన్స్‌కు చేరువ కావడంలో యూట్యూబ్ తమకు సహకరించిందని యూట్యూబ్ చానెల్ కలిగిన 92 శాతం సంస్ధలు పేర్కొన్నాయి. భారత్‌లో యూట్యూబ్ క్రియేటర్ల వినూత్న పోకడలు దేశ ఆర్ధిక వ్యవస్ధలో ఉత్తేజం కలిగించేలా ప్రభావం చూపాయని యూట్యూబ్ పార్టనర్షిప్స్ ఏపీఏసీ, రీజినల్ డైరెక్టర్ అజయ్ విద్యాసాగర్ తెలిపారు. దేశంలో యూట్యూబ్ క్రియేటర్ ఎకానమీ ఆర్ధిక వృద్ధి, ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా సాంస్క్రతిక ప్రభావాన్ని చాటిచెబుతున్నాయని అన్నారు.
రాబోయే రోజుల్లో నూతన తరం మీడియా కంపెనీలు గ్లోబల్ ఆడియన్స్‌తో కనెక్ట్ అవుతూ భారత ఆర్ధిక వ్యవస్ధలో జోష్ నింపేలా ముందుకువెళతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యూట్యూబ్ వేదిక తమ వృత్తిపర లక్ష్యాలపై సానుకూల ప్రభావం చూపుతోందని భారత్‌లో 80 శాతం మందికిపైగా క్రియేటివ్ ఎంట్రప్రెన్యూర్లు చెబుతున్నారు. భారత క్రియేటర్ల వ్యాపార వృద్ధి, లక్ష్యాలను నెరవేర్చడంలో యూట్యూబ్ సానుకూల ప్రభావం చూపుతోందని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ సీఈఓ అడ్రియన్ కూపర్ తెలిపారు.