Civil Aviation | కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం, మెరుగైన వసతులు, అంతర్జాతీయ ఏవియేషన్ హబ్స్ అభివృద్ధితో దేశీయ పౌర విమానయాన రంగం 2024లో గణనీయ పురోగతి సాధించింది. పౌర విమానయాన రంగం అభివృద్ధికి కేంద్ర విధానాలు సహాయకారిగా నిలిచాయి. తద్వారా దేశవ్యాప్తంగా భారతీయులు తమకు నచ్చిన క్షేత్రాలకు విమానయానం చేసేందుకు డిమాండ్ పెరిగింది. దేశంలో తొలిసారి ఒక్కరోజే ఐదు లక్షల మంది విమాన ప్రయాణం చేసిన రికార్డు నమోదైంది. నవంబర్ 17న దేశవ్యాప్తంగా 5,05,412 మంది ప్రయాణికులు విమానాల్లో పర్యటించారు. 3100కి పైగా విమానాలు ఐదు లక్షల మందికి పైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడంతో భారత్.. గ్లోబల్ ఏవియేషన్ హబ్ గా అవతరిస్తోందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.
2024 ఆర్థిక సంవత్సరలో మొత్తం 15 శాతం విమాన ప్రయాణికులు పెరిగారు. ఈ ఏడాది 37.6 కోట్ల మంది ప్రయాణికులు భారత విమానాశ్రయాల మీదుగా ప్రయాణించారు. తద్వారా ప్రపంచంలోకెల్లా మూడో అతిపెద్ద విమానయాన రంగంగా నిలిచింది. నవంబర్ నెలలో 999 బాంబు బెదిరింపు కాల్స్ లేదా మెసేజ్ లు వచ్చాయి. బాంబు బెదిరింపు కాల్స్, మెసేజీలపై జనవరి నుంచి నవంబర్ మధ్య 256 కేసులు నమోదైతే, అక్టోబర్ 14- నవంబర్ 14 మధ్య 163 కేసులు నమోదు కాగా, 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశ ప్రజలందరికీ విమానయాన సర్వీసులు అందుబాటులోకి తేవడానికి కేంద్రం ‘ఉడాన్’ స్కీమ్ తెచ్చింది. తూర్పు నుంచి పశ్చిమానికి, ఉత్తరం నుంచి దక్షిణానికి మధ్య 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అనుసంధానించేందుకు ఉడాన్ స్కీమ్ ఉపకరించింది. దేశవ్యాప్తంగా నవంబర్ 25 నాటికి ఉడాన్ స్కీం సాయంతో 86 విమానాశ్రయాల పరిధిలో 609 రూట్లను అనుసంధానించారు. పౌర విమాన యానరంగాన్ని మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అధునాతన భద్రతా ఏర్పాట్లతో ప్రయాణికులకు భదత్రా సౌకర్యం మరింత మెరుగు పరిచారు. సీసీటీవీ కెమెరాలు, డ్యుయల్ వ్యూ ఎక్స్-బీఐఎస్, బయో మెట్రిక్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్, క్యూ మేనేజ్ మెంట్ సిస్టమ్, ఆటోమోటివ్ ట్రే రిట్రైవల్ సిస్టమ్, పెరిమీటర్ ఇంట్రుషన్ డిటెక్షన్ సిస్టమ్, రిమోట్ స్క్రీనింగ్ తదితర సేఫ్టీ పద్దతులను దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో అమల్లోకి తెచ్చారు.