Year Ender 2024 | అంతరిక్షరంగంలో భారత్ ఈ ఏడాది కొత్త శిఖరాలను అధిరోహించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), యూఎస్ స్పేస్ ఏజెన్సీ (నాసా), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) సహా ప్రపంచంలోనే అనేక అంతరిక్ష సంస్థలు విశ్వం గుట్టు విప్పేందుకు ఎప్పటికప్పుడు కొత్త మిషన్లను చేపడుతున్నాయి. 2024 సంవత్సరం అంతరిక్ష రంగానికి చాలా ప్రత్యేకమైంది. ఈ సంవత్సరం అంతరిక్ష సంస్థలు యూరోపా క్లిప్పర్, ప్రోబాతో సహా అనేక మిషన్లను ప్రారంభించాయి.
ఇస్రో డిసెంబర్ 5, 2024న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ సహాయంతో ప్రోబా-3 మిషన్‌ను ప్రయోగించింది. ఈ మిషన్‌లో, రెండు ఉపగ్రహాలు కరోనాగ్రాఫ్, ఓకల్టర్ సూర్యుడి కరోనాను అంటే సూర్యుడి బయటి పొరను అధ్యయనం చేస్తాయి. ఓకల్టర్ ఉపగ్రహం కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టిస్తే.. కరోనాగ్రాఫ్ సూర్యుడి కరోనాపై పరిశోధన చేస్తుంది. సూర్యుడి కరోనా నిర్మాణం, సౌర తుపానులపై అధ్యయనం చేస్తుంది.
ఎలోన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో పోలారిస్ డాన్ ప్రారంభించింది. ఈ మిషన్‌లో వ్యోమగాములను నింగిలోకి పంపింది. స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ వ్యామగాములను నింగిలోకి తీసుకెళ్లింది. మిషన్ సమయంలో తొలిసారిగా స్పేస్‌లో ప్రైవేట్ స్పేస్‌వాక్ నిర్వహించింది. భూమికి తక్కువ కక్ష్యలో శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. స్పేస్ ఎక్స్ తయారు చేసిన సూట్‌ని పరీక్షించడంతో పాటు దాదాపు 40 రకాల పరిశోధనలు చేపట్టారు. మైక్రో గ్రావిటీలో మనిషి శరీరం పనితీరు, కిడ్నీల పనితీరు, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం, స్పేస్‌లో సీపీఆర్ ప్రొసీజర్ తదితర అంశాలపై అధ్యయనం నిర్వహించారు.
అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ ననాసా అక్టోబర్‌లో యూరోపా క్లిప్పర్ మిషన్‌ను చేపట్టింది. జుపిటర్ (బృహస్పతి) చంద్రుడు అయిన యూరోపాను అధ్యయనం చేయడమే ఈ మిషన్ ఉద్దేశం. ఈ మిషన్ 2030 నాటికి 1.8 బిలియన్ మైళ్లు ప్రయాణించి గురుగ్రహానికి చేరుతుంది. ప్రయాణ సమయంలోనే ఈ వ్యోమ నౌకలో ఏర్పాటు చేసిన తొమ్మిది సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్ యూరోపా చంద్రుడి వాతావరణం, ఐస్ క్రస్ట్, దాని కింద సముద్రానికి సంబంధించిన డేటాను సేకరిస్తాయి. దాదాపు 10 అడుగుల వెడల్పు డిష్ ఆకారంలో ఉండే యాంటెన్నా, అనేక చిన్న యాంటెన్నాలు భూమికి డేటాను పంపనున్నాయి. జుపిటర్కి 95 ఉపగ్రహాలు ఉన్నాయి. యూరోపా నాలుగో అతిపెద్ద చంద్రుడు. దాని ఉపరితలంపై ఉప్పునీటితో మంచు ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమిపై ఉన్న నీటి కంటే యూరోపాలో రెండు రెట్లు ఎక్కువ నీరు ఉందని శాస్త్రవేత్తల అంచనా. ఇక్కడ జీవం ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. లేదంటే అభివృద్ధి చెందుతూ ఉండవచ్చని.. లేకపోతే ఇంతకు ముందే ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.
చైనా చాంగ్-ఇ 6 మిషన్ 2024 మేలో ప్రారంభించింది. ఈ మిషన్ ప్రధాన లక్ష్యం చంద్రుడి మారుమూల ప్రాంతాల నుంచి నమూనాలను తీసుకువచ్చి వాటిని పరిశోధించడం. ఈ మిషన్ కింద తీసుకువచ్చిన నమూనాలు చంద్రుని నిర్మాణం, దాని ఉపరితలం దాని పరిణామం గురించి కొత్త సమాచారాన్ని అందించాయి. జూన్ 2న చంద్రుడి సౌత్ పోల్ అయిట్కిన్ ప్రాంతంలో దిగిన ల్యాండర్ రోబోటిక్ హ్యాండ్ సహాయంతో జాబిలిపై మట్టిని సమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి తీసుకువచ్చింది. అయితే, చంద్రుడిపై 2.5 మిలియన్ సంవత్సరాల కిందట అగ్ని పర్వతాలు ఉండేవని అంచనా వేస్తున్నారు. అలాగే, చంద్రుడి రెండువైపులా భౌగోళిక వ్యత్యాసాలకు సంబంధించిన వివరాలు సైతం వెల్లడయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
చైనాకు చెందిన స్పేస్ పయనీర్ మే 2024లో ప్రయోగించింది. ఇది చైనాకు ప్రైవేటు రాకెట్. ఈ మిషన్ ఉద్దేశం భూమి కక్ష్యలో ఉపగ్రహాలను ఉంచడం. టియన్లాంగ్-3 వాణిజ్య అంతరిక్ష సామర్థ్యాలను మెరుగుపరచడానికి, ప్రవేట్ అంతరిక్ష రంగంలో పోటీని ప్రోత్సహించేందుకు చైనా అభివృద్ధి చేసింది.
స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ (SLIM) చంద్రుడిపైకి జపాన్ మిషన్. జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా జనవరి 2024లో దీన్ని ప్రారంభించింది. చంద్రుడిపై ఖచ్చితమైన ల్యాండింగ్ సాంకేతికతను పరీక్షించడం దీని ఉద్దేశ్యం. మిషన్‌లో చంద్రుడిపై ల్యాండింగ్‌తో అమెరికా, రష్యా, చైనా, భారత్‌ల తర్వాత చంద్రుడి మీద సేఫ్ ల్యాండింగ్ చేసిన ఐదో దేశంగా జపాన్ రికార్డులకెక్కింది.
ఈ మిషన్‌ను ఆస్ట్రోబోటిక్ కంపెనీ జనవరి 2024లో ప్రారంభించింది. ఇది నాసా కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ (CLPS) ప్రోగ్రామ్‌లో చేర్చారు. ఇది చంద్రునికి పేలోడ్లను అందించడానికి రూపొందించారు. ముఖ్యమైన డేటాను సేకరించడానికి ఈ మిషన్ చేపట్టగా.. కానీ, ల్యాండింగ్ అనుకున్న విధంగా జరగలేదు.