
Global Billioneers | మరో ఐదు రోజుల్లో 2021 మనకు గుడ్‌బై చెప్పేయబోతున్నది. 2022కి స్వాగతం పలికేందుకూ రంగం సిద్ధమైంది. ఏడాది కాలంలో యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిన అగ్రశ్రేణి బిజినెస్ టైకూన్స్ గురించి.. 2021లో భారీగా ఒనకూడిన వ్యక్తిగత సంపద గురించి తెలుసుకుందాం.. వారి విజయగాధలు స్ఫూర్తిదాయకమే కాదు.. ఆ లక్ష్యాల సాధనకు మీకు సహకరిస్తాయి. అయితే, గ్లోబల్ టాప్-10 బిలియనీర్స్ జాబితాలో.. దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీకి చోటు దక్కలేదు. 12వ ర్యాంక్ పొందిన ముకేశ్ అంబానీ.. ప్రపంచ వ్యాప్త భారతీయులందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. టాప్-10 బిలియనీర్లలో తొమ్మిది మంది అమెరికన్లయితే.. ఒకరు ఫ్రాన్స్‌కు చెందిన వారు. వారి గురించి.. వారి వ్యక్తగత సంపద గురించి తెలుసుకుందాం..

ప్రపంచకుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న బిజినెస్ మాగ్నెట్ ఎలన్‌మస్క్. ఈ నెల 27 నాటికి గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ నికర వ్యక్తిగత సంపద 274 బిలియన్ల డాలర్లు. ఎలన్‌మస్క్ సారధ్యంలోని రాకెట్ల తయారీ సంస్థ స్పేస్ఎక్స్కు గత ఫిబ్రవరిలో తొలి దశ నిధులు 74 బిలియన్ల డాలర్లు సమకూరాయి. ఎలన్ మస్క్.. 2018లో టెస్లా చైర్మన్‌గా వైదొలిగారు.

గ్లోబల్ ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ బెజోస్.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కుబేరుడు. ఈ నెల 27 నాటికి ఆయన నికర సంపద 197 బిలియన్ల డాలర్లు. అమెజాన్ వ్యవస్థాపక సీఈవోగా వ్యవహరించిన జెఫ్ బెజోస్ ఈ ఏడాది జూలై ఐదో తేదీన సీఈవోగా వైదొలిగారు. ప్రస్తుతం అమెజాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. కరోనా వేళ 2020 నుంచి అమెజాన్ ఆదాయం 386 బిలియన్ల డాలర్లు పెరిగింది.

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కుబేరుడు బెర్నార్డ్ అర్నాల్ట్.. ఆయన కుటుంబం. ఆయన వ్యక్తిగత సంపద 195.8 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోకెల్లా లగ్జరీ బ్రాండ్ కంపెనీగా ఎల్వీఎంహెచ్.. గత జనవరిలో అమెరికా జ్యువెల్లరీ కంపెనీ టిఫాన్సీ అండ్ కోను 15.8 బిలియన్ డాలర్లకు టేకోవర్ చేసుకోవడం పతాక శీర్షికలకెక్కింది.

బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కుబేరుడు. ఆయన వ్యక్తిగత సంపద 137.3 బిలియన్ల డాలర్లు. గతేడాది టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి వైదొలిగిన తర్వాత దాతృత్వం.. జీరో కార్బన్ ఎనర్జీలో ఆయన పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటి వరకు బిల్‌గేట్స్ 35.8 బిలియన్ల డాలర్ల విలువ గల మైక్రోసాఫ్ట్ స్టాక్స్‌ను తమ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చేశారు.

గూగుల్ పేరెంట్ సంస్థ అల్ఫాబెట్ సీఈవోగా 2019లో వైదొలిగిన ల్యారీ పేజ్.. ప్రపంచంలోనే ఐదో కుబేరుడు. ఆయన నికర ఆస్తి 125.3 బిలియన్ల డాలర్లు. 1998లో సెర్జెయ్ బ్రిన్‌తో కలిసి గూగుల్‌ను స్థాపించారు. ప్రస్తుతం ప్లానెటరీ రీసొర్సెస్కు ఫౌండింగ్ ఇన్వెస్టర్‌గా ఉన్నారు. కిట్టీ, హాక్ అండ్ ఓపెనర్ వంటి స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెడుతున్నారు.

ఒరాకిల్ సహా వ్యవస్థాపకుడు, చైర్మన్ అండ్ సీటీవో ల్యారీ ఎల్లిసన్. వ్యక్తిగత సంపదలో ప్రపంచంలోనే ఆరో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత సంపద 122.5 బిలియన్ల డాలర్లు. కంపెనీలో 35 శాతం వాటా ఆయనదే. గ్లోబల్ ఈవీ టెస్లాలో 2018 డిసెంబర్లో 30 లక్షల షేర్లు కొనుగోలు చేశారు. 2014లో ఒరాకిల్ సీఈవోగా వైదొలిగారు.

సెర్జెయ్ బ్రిన్ 2019 డిసెంబర్లో గూగుల్ పేరెంట్ సంస్థ అల్ఫాబెట్ అధ్యక్షుడిగా వైదొలిగారు. వ్యక్తిగత సంపదలో ఏడో కుబేరుడాయన. ఈ నెల 27న ఆయన నికర వ్యక్తిగత సంపద 120.7 బిలియన్ల డాలర్లు. 1998లో సెర్జెయి బ్రిన్‌తో కలిసి గూగుల్‌ను స్థాపించారు. ఇప్పటికీ సెర్జెయ్ బ్రిన్.. గూగుల్ పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్‌లో బోర్డు సభ్యుడిగా ఉన్నారు. హైటెక్ ఎయిర్‌షిప్ ప్రాజెక్టులో సెర్జెయి బ్రిన్ నిధులు పెట్టుబడిగా పెట్టారు.

19 ఏండ్ల వయస్సులోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌ను 2004లో స్థాపించిన మార్క్ జుకర్‌బర్గ్ 2012లో వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన 12 శాతం వాటా కలిగి ఉన్నారు. ఆయన, ఆయన భార్య ప్రిస్కిల్లా ఛాన్ దంపతులు ఫేస్బుక్లో తమ 99 శాతం వాటా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన నికర వ్యక్తిగత సంపద 119.9 బిలియన్ డాలర్లు. ఆయన ప్రపంచంలోనే ఎనిమిదో కుబేరుడు.

బర్క్‌షైర్ హాత్వే సీఈవో వారెన్ బఫెట్.. ప్రపంచంలోకెల్లా తొమ్మిదో కుబేరుడు. ఆయన వ్యక్తిగత నికర సంపద 107.2 బిలియన్ డాలర్లు. బ్యాటరీ మేకర్ డురాసెల్, ఇన్సూరర్ గైకోలతోపాటు 60కి పైగా కంపెనీల్లో ఆయన బర్క్‌షైర్ హాత్వే కంపెనీ పెట్టుబడులు పెట్టింది. గేట్స్ ఫౌండేషన్‌కు 45 బిలియన్ల డాలర్లు విరాళంగా అందజేశారు. తన జీవిత కాలంలో 99 శాతం సంపదను విరాళంగా ఇచ్చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. లాస్ ఎంజిల్స్ క్లిప్పర్స్ ఓనర్ స్టీవ్ బాల్మెర్.. ప్రపంచంలోనే పదో కుబేరుడు. ఆయన వ్యక్తిగత నికర సంపద 105.4 బిలియన్ డాలర్లు. మైక్రోసాఫ్ట్ నుంచి రిటైరైన ఏడాదే లాస్ ఎంజిల్స్ క్లిప్పర్స్ను 200 కోట్ల డాలర్లకు కొనుగోలు చేశారు. నాన్ఫ్రాఫిట్, ప్రభుత్వ సంస్థలకు సాఫ్ట్వేర్ కోసం 59 మిలియన్ల డాలర్లు స్టీవ్ బాల్మెర్ పెట్టుబడులు పెట్టారు.