న్యూఢిల్లీ, నవంబర్ 11: జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన సంస్థ యమహా.. ప్రీమియం సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఒకేసారి నాలుగు వాహనాలను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో ఎక్స్ఎస్ఆర్ 155ను సరికొత్తగా ప్రవేశపెట్టిన సంస్థ..అలాగే ఎఫ్‌జెడ్-రేవ్, ఆర్15, ఎంటీ15 మాడళ్లను ఆధునీకరించి మళ్లీ విడుదల చేసింది.
వీటిలో ఎక్స్ఎస్ఆర్ 155 మాడల్ ధరను రూ.1,49,990గా నిర్ణయించిన సంస్థ..ఎఫ్‌జెడ్-రేవ్ మాడల్ ధరను రూ.1,17,218గా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ సందర్భంగా యమహా ఎగ్జిక్యూటివ్ అధికారి ఇటారు ఒటాని మాట్లాడుతూ…భారత్‌లో ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఏడాది చివరినాటికి ఎలక్ట్రిక్ స్కూటర్‌తోపాటు పది కొత్త మాడళ్లు, 20 అప్డేటెడ్ వాహనాలను విడుదల చేయనున్నట్టు చెప్పారు.