PayTM | ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ సంస్థ పేటీఎంకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. స్టాక్ మార్కెట్లలో లిస్టయిన తొలిరోజే పేటీఎం స్క్రిప్ట్ 27 శాతం కోల్పోయింది. ఐపీవోకు వెళ్లినప్పుడు పేటీఎం షేర్ విలువ రూ.2,150. కానీ గురువారం అంతర్గత ట్రేడింగ్‌లో 27 శాతం నష్టపోయింది. ఐపీవోలో పేటీఎం షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఒక్కో షేర్ మీద రూ.586 నష్టపోయారు.
ప్రస్తుతం పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. లిస్టింగ్‌కు ముందు పేటీఎం ఎం-క్యాప్ రూ.1.48 లక్షల కోట్లు. దీంతో ఇన్వెస్టర్లు రూ.47 వేల కోట్ల మేరకు నష్టపోయారు. నైకాతో పోలిస్తే పేటీఎం ఎం-క్యాప్ రూ.2000 కోట్లు తక్కువ.
ఇప్పటివరకు దేశీయ స్టాక్ మార్కెట్లలో నాలుగు స్టార్టప్ సంస్థలు లిస్టయిన స్టార్టప్‌లతో పోలిస్తే పేటీఎం దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. స్టాక్ మార్కెట్లో పేటీఎం లిస్టవుతున్నవేళ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటిని ఆపుకోలేకపోయారు. కర్చీప్‌తో తన మొహాన్ని తుడుచుకున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయిన పేటీఎం.. బీఎస్ఈలో రూ.1955, ఎన్ఎస్ఈలో రూ.1950కే ట్రేడయింది. ఇది పేటీఎం ఐపీవో ప్రతిపాదిత ధర రూ. 2,150కంటే 9 శాతం తక్కువ. మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. జొమాటో కంటే పేటీఎం తక్కువ ఎం-క్యాప్ కలిగి ఉంది. పేటీఎం ఎం-క్యాప్ రూ.1.01 లక్షల కోట్లయితే, జొమాటో ఎం-క్యాప్ రూ.1.22 లక్షల కోట్లు. పేటీఎం స్క్రిప్ట్ 44 శాతం వరకూ పతనం కావచ్చునని బ్రోకరేజ్ హౌస్ మాక్క్వారీ అంచనా వేసింది.