‘రుణాలపై పెరుగుతున్న వడ్డీరేట్లు, దేశ ప్రజల ఆదాయంలో తగ్గుతున్న వృద్ధి.. వినియోగ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు, ఆర్థిక సాయాల ఉపసంహరణల సెగ సైతం జీడీపీకి తాకుతున్నది’
-తాజా నివేదికలో ప్రపంచ బ్యాంక్
న్యూఢిల్లీ/వాషింగ్టన్, ఏప్రిల్ 4: భారత్‌కు ప్రపంచ బ్యాంక్ షాకిచ్చింది. జీడీపీ అంచనాను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) దేశ వృద్ధిరేటు 6.3 శాతానికే పరిమితం కావచ్చని మంగళవారం తమ తాజా నివేదిక ‘ఇండియా డెవలప్మెంట్ అప్డేట్’లో పేర్కొన్నది. ఇంతకుముందు ఇది 6.6 శాతంగా ఉండగా.. దీనికిప్పుడు 0.3 శాతం కోత పెట్టడం గమనార్హం. దేశంలో పడిపోతున్న వినియోగ సామర్థ్యమే వృద్ధిరేటు అంచనాకు కత్తెర వేసిందని ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. వినియోగం వృద్ధిలో మందగమనంతోపాటు అంతర్జాతీయ పరిస్థితులతో ఎదురవుతున్న సవాళ్లు.. దేశ జీడీపీ ప్రగతికి ప్రతిబంధకాలుగా మారాయని ప్రపంచ బ్యాంక్ వివరించింది.
మున్ముందు దేశీయ కరెన్సీ రూపాయి.. మరిన్ని ఒత్తిళ్లను ఎదుర్కోక తప్పదని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించడం ప్రాధాన్యతను సంతరించుకున్నదిప్పుడు. ఈ ఆర్థిక సంవత్సరం భారత్‌కు ప్రతికూల పవనాలే వీస్తాయన్న వరల్డ్ బ్యాంక్.. అమెరికా, యూరప్‌ల్లో ఇటీవలి ఆర్థిక సంక్షోభం రూపాయిపై ఒత్తిడిని తెస్తాయని అభిప్రాయపడింది. ఈ క్రమంలో భారత్‌లో ప్రైవేట్ పెట్టుబడులూ ప్రభావితం కావచ్చన్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 6.4 శాతంగానే నమోదు కావచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) తమ ఏడీవో-ఏప్రిల్ 2023 ఎడిషన్‌లో అంచనా వేసింది. కఠిన ద్రవ్య విధానం, మళ్లీ విజృంభిస్తున్న చమురు ధరల నేపథ్యంలో గతంలో వేసిన అంచనాకు కోత పెట్టింది. ఇంతకుముందు ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 7.2 శాతంగా ఉండొచ్చని ఏడీబీ చెప్పడం గమనార్హం.
గత ఆర్థిక సంవత్సరం (2022-23) దేశ జీడీపీ 7 శాతంగా ఉండొచ్చని ఈ ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అసలు గణాంకాలు ప్రకటించడానికి కనీసం మూడేైండ్లెనా పట్టొచ్చు. అవును.. గత కొన్నేండ్లుగా ఇలాగే జరుగుతున్నదంటే నమ్మక తప్పని నిజం. ఉదాహరణకు 2017-18కి సంబంధించి తుది జీడీపీ డాటా జనవరి 2021లో విడుదలైంది. జనవరి 2018లో వచ్చిన తొలి అంచనా కంటే 1.5 శాతం పెరిగి 11 శాతంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇదే నిజమైతే అప్పుడే ప్రకటించాలని, ఇంత ఆలస్యం ఎందుకన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. పైగా బడ్జెట్ లోటు లేకుండా సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులను కేటాయించే వీలు కూడా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ బడ్జెట్, ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలు, వివిధ పథకాలకు కేటాయించే నిధులు.. దేశ జీడీపీ గణాంకాలపైనే ఆధారపడి ఉంటాయి మరి. అయినప్పటికీ ఈ విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూనే ఉందన్న విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. 2022-23 జీడీపీ గణాంకాల ప్రొవిజనల్ అంచనా ఈ మే 31న, తొలి రివైజ్డ్ అంచనా వచ్చే జనవరిలో, రెండో రివైజ్డ్ అంచనాకు ఏడాది, రెండేైండ్లెనా పట్టవచ్చని విశ్లేషకులు.. కేంద్రం అసమర్ధతను ఎండగడుతున్నారిప్పుడు.
Capture