World Bank | ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్‌గా, డెవలప్మెంట్ ఎకనమిక్స్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్‌గా భారత సంతతి ఆర్థికవేత్త ఇందర్మిత్ గిల్ నియమితులయ్యారు. ఆయన నియామకం వచ్చే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కౌశిక్ బసు తర్వాత ప్రపంచ బ్యాంక్ ఎకనమిస్ట్‌గా నియమితులైన రెండో భారత సంతతి ఆర్థిక వేత్త ఇందర్మిత్ గిల్ కానున్నారు. 2012-16 మధ్య కౌశిక్ బసు.. ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్‌గా పని చేశారు. ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్లుగా పని చేసిన రఘురామ్ రాజన్, గీతా గోపీనాథ్.. భారత సంతతి వారే.
వివిధ దేశాల సూక్ష్మ ఆర్థిక అసమానతల పరిష్కారం, వృద్ధి, దారిద్యరం, భూతాపం తదితర అంశాలపై ఇందర్మిత్ గిల్ పని చేశారని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్మాల్పాస్ ఓ ప్రకటనలో తెలిపారు. కార్మెన్ రెయిన్హర్ట్ స్థానంలో ఇందర్మిత్ గిల్ నియమితులయ్యారు. ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్‌గా నియమితులు కావడం తనకు ఎంతో గౌరవం అని చెప్పారు.
చికాగో యూనివర్సిటీ, జార్జిటౌన్ యూనివర్సిటీలో బోధకుడిగా ఇందర్మిత్ గిల్ ఉన్నారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనమిక్స్‌లో బీఏ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ఎంఏ పట్టా అందుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఎకనమిక్స్‌లో పీహెచ్డీ పట్టా పొందారు.