హైదరాబాద్, డిసెంబర్ 24: భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధిచెందాలన్న విధాన నిర్ణేతల ఆకాంక్షలు వాస్తవరూపం దాల్చినా, తలసరి ఆదాయం 3,472 డాలర్లకు (దాదాపు రూ.2.80 లక్షలు) చేరుతుందని, అయినా భారత్‌ను మధ్యాదాయ దేశంగానే గుర్తిస్తారని రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్, ఆర్థిక వేత్త సీ రంగరాజన్ చెప్పారు. అక్కడ్నుంచి ఉన్నత మధ్యాదాయ దేశంగా ఎదగాలంటే మరో రెండేండ్లు పడుతుందని, అటుతర్వాత కనీసం 13,205 డాలర్ల (దాదాపు రూ. 11 లక్షలు) తలసరి ఆదాయంతో అభివృద్ధిచెందిన ధనిక దేశంగా ఆవిర్భవించడానికి రెండు దశాబ్దాలకుపైగా సమయం పడుతుందని వివరించారు. శనివారం హైదరాబాద్‌లోని ఐసీఎఫ్ఏఐ ఫౌండేషన్ 12వ స్నాతకోత్సవంలో రంగరాజన్ ప్రసంగిస్తూ 8-9 శాతం వార్షిక వృద్ధి సాధిస్తేనే అభివృద్ధిచెందిన దేశంగా భారత్ రూపొందుతుందన్నారు.
జీడీపీ పరిమాణం దృష్ట్యా ప్రపంచంలో ఇప్పుడు భారత్ ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ, తలసరి ఆదాయంతో పోల్చిచూస్తే ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం 197 దేశాల్లో ఇండియా ర్యాంక్ 142గా ఉందని రంగరాజన్ తెలిపారు. ‘ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును పెంచడంపైనే విధాన నిర్ణేతలు తక్షణం దృష్టిసారించాలి. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలన్న ఆకాంక్ష మంచి స్వల్పకాలిక లక్ష్యమే’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఈ లక్ష్యాన్ని సాధించాలంటే వార్షికంగా 9 శాతం వృద్ధిని కనపరిస్తే కనీసం ఐదేండ్లు పడుతుందని, అప్పటికీ భారత్ తలసరి ఆదాయం 3,472 డాలర్లు మాత్రమే ఉంటుందని, దీంతో మధ్యాదాయ దేశంగా మనల్ని వర్గీకరిస్తారన్నారు. కేంద్ర ఆర్థిక సలహా మండలి మాజీ ఛైర్మన్ అయిన రంగరాజన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘ధనికదేశం కావడానికి మనం చాలా దూరం ప్రయాణించాలి. ఇది సాధించడానికి మనం వేగంగా పరుగుతీయాల్సిన అవసరం ఉంది’ అంటూ ఉద్బోధించారు. కొవిడ్-19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి భారత్ ఒక స్పష్టమైన బాటను నిర్దేశించుకోవాలని సూచించారు. తొలుత వృద్ధి రేటును 7 శాతానికి పెంచుకుని, అటుపై 8 నుంచి 9 శాతానికి చేర్చుకోవాలన్నారు. ఇంతటి అధిక వృద్ధిని వరుసగా ఆరేడు ఏండ్లు సాధించగలిగే సత్తా భారత్‌కు ఉందని గతంలో నిరూపితమయ్యిందని గుర్తుచేశారు.