Wipro Financial Results | ఐటీ మేజర్ విప్రో (Wipro) గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) డిసెంబర్ త్రైమాసికం నికర లాభాల్లో వెనక బడింది. 2022-23తో పోలిస్తే ఈ ఏడాది మూడో త్రైమాసికం నికర లాభం 11 శాతం తగ్గింది. గతేడాది డిసెంబర్ త్రైమాసికం నికర లాభం రూ.3052.9 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.2,694.2 కోట్లతో సరి పెట్టుకున్నది. సెప్టెంబర్ త్రైమాసికం నికర లాభం రూ.2,646.3 కోట్లతో పోలిస్తే ఎక్కువే.
ఆపరేషన్స్ ద్వారా విప్రో కంపెనీ ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. 2022-23 మూడో త్రైమాసికంలో రూ.23,290 కోట్ల రెవెన్యూ గడిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో రూ.22,205.1 కోట్లకు పరిమితమైంది. సెప్టెంబర్ త్రైమాసికం రెవెన్యూ రూ.22,515.9 కోట్లుగా నిలిచింది. విప్రో ఐటీ బిజినెస్ రెవెన్యూ స్వల్పంగా 1.1 శాతం తగ్గి రూ.22,151 కోట్లతో సరి పెట్టుకున్నది. ఐటీ బిజినెస్ ఈబీఐటీ మార్జిన్ 16 శాతం.. సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 16.1 శాతం.
ఇన్ఫీ బాటలోనే విప్రో పయనిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం రెవెన్యూ గైడెన్స్ 1.5 నుంచి 0.5 శాతానికి కుదించి వేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం తుది త్రైమాసికంలో ఐటీ సర్వీసెస్ బిజినెస్ ద్వారా 2615 మిలియన్ల డాలర్ల నుంచి 2669 మిలియన్ల డాలర్ల రెవెన్యూ వస్తుందని అంచనా వేసినట్లు విప్రో తెలిపింది. ఇక విప్రోలో అట్రిక్షన్లు పది త్రైమాసికాల కనిష్ట స్థాయి 12.3 శాతానికి పడిపోయాయి.
వాటాదారులకు విప్రో ఒక్కో షేర్ మీద రూపాయి ఇంటరిం డివిడెండ్ ప్రకటించింది. వచ్చేనెల 10న వాటాదారులకు ఇంటరిం డివిడెండ్ చెల్లిస్తామని రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. విప్రో ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో సంస్థ స్టాక్స్ శుక్రవారం నాలుగు శాతానికి పైగా పుంజుకున్నాయి. బీఎస్ఈలో విప్రో షేర్ రూ.466.10 వద్ద ముగిసింది. విప్రో సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ థెర్రీ డెలాపోర్టే స్పందిస్తూ.. ‘సీజనల్‌గా డిసెంబర్ త్రైమాసికం సాఫ్ట్‌గా ఉంది. డీల్ బుకింగ్స్‌లో శక్తిమంతంగా ఉన్నాం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీ డీల్స్ విషయంలో 20 శాతం గ్రోత్ సాధించాం’ అని చెప్పారు.