న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,569.6 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.2,834.6 కోట్ల లాభంతో పోలిస్తే 26 శాతం వృద్ధిని కనబరిచింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.22,208.3 కోట్ల నుంచి రూ.22,504.2 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.89,088.4 కోట్ల ఆదాయంపై రూ.13,135.4 కోట్ల నికర లాభాన్ని గడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఐటీ ఆదాయం 2,505-2,557 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని అంచనావేస్తున్నది.