Akshaya Tritiya 2023 | అక్షయ తృతీయ.. ప్రతి తెలుగు సంవత్సరాది వైశాఖ మాసం శుక్ల పక్ష తృతీయను ‘అక్షయ తృతీయ’ అని పిలుస్తారు. సంస్కృతంలో అక్షయ అంటే ‘శాశ్వతమైన, అంతులేని ఆనందం, విజయం’ అని వేద పండితులు చెబుతారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం వల్ల పలు రకాల బెనిఫిట్లు ఉన్నాయి. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం వల్ల ఐశ్వర్యం లభించడంతోపాటు లాభాలు కలుగుతాయని నమ్మకం. ఈ పర్వదినం రోజు భారతీయులు శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం త్రేతాయుగంలో అక్షయ తృతీయ మొదలైంది. ఈ పర్వదినం రోజు ప్రత్యేక పూజలతో ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందామా..
ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 22 అంటే శనివారం ఉదయం 7:49 గంటలకు మొదలై ఆదివారం అంటే ఏప్రిల్ 23 ఉదయం 7:47 గంటలకు ముగుస్తుంది. ప్రత్యేక పూజలు చేయడానికి శనివారం ఉదయం 7:49 గంటల నుంచి మధ్యాహ్నం 12:20 గంటల వరకు ముహూర్తం. మొత్తం నాలుగు గంటల 31 నిమిషాలు పడుతుంది. శనివారం ఉదయం 7:49 గంటల నుంచి ఆదివారం ఉదయం 7:47 గంటల్లోపు ఎప్పుడైనా బంగారం కొనుగోలు చేయవచ్చు.
అక్షయ తృతీయ నాడు ఉపవాసం ఉండే వారు తప్పనిసరిగా ఉదయం ప్రాంత:కాలాన్నే స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించాలి. విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించి.. తులసి, పసుపు పూలమాల సమర్పించాలి. పూజలో భాగంగా నెయ్యి దీపం వెలిగించడంతో మంచి ప్రయోజనాలు చేకూరతాయని వేద పండితులు తెలిపారు. విష్ణు పూజలో తప్పనిసరిగా విష్ణు చాలీసా పఠించాలి.
పరుశు రాముడు, హయగ్రీవుడు అవతరించిన రోజు నుంచే త్రేతాయుగం మొదలైందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు ఏ పనులు చేసినా అన్ని మంచి ప్రయోజనాలే చేకూరతాయి. ఈ రోజు గంగా స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు నదీ స్నానాలు చేయడంతో అన్ని రకాల దుష్ప్రభావాలు నశించడమే కాక లాభాలు చేకూరుతాయని వేద పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ నాడు బియ్యం, పాలు, ఇతర వస్తువులు దానం చేయడం కూడా ఆనవాయితీగా వస్తున్నది.
అక్షయం అంటే తరనిది అని అర్థం.. అక్షయ తృతీయ అంటే ప్రస్తుత ఆధునిక కాలంలో బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువుల కొనుగోలు అనే ప్రచారం ఉంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు, పాఠశాలలో పిల్లలకు అడ్మిషన్, పుస్తకావిష్కరణ, పుణ్య స్థలాల సందర్శన వంటి శుభ కార్యాలు చేస్తారు. ఇంటి స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించడంతో సత్ఫలితాలు వస్తాయని అంతా విశ్వసిస్తారు.
అక్షయ తృతీయ నాడు బంగారం లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఐశ్వర్యం కలిగి వస్తుందని ప్రతీతి. ఐశ్వర్యానికి అధినేత్రి శ్రీమహాలక్ష్మి. ఆమె అనుగ్రహం ఉంటే జీవితంలో ఏ లోటూ ఉండదు. అందుకే లక్ష్మీ దేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ నాడు ప్రత్యేక పూజలు చేస్తారు. భారతదేశంలో బంగారానికే ఎక్కువ విలువ. ప్రపంచ దేశాల్లోకెల్లా మన దేశంలోనే బంగారం ఎక్కువగా ఉంది. సంపదకు బంగారం చిహ్నం. ఈ రోజు బంగారం కొంటే ఏడాది పొడవునా సంపద సమకూరుతుందన్న నమ్మకంతో పుత్తడి కొనుగోలు చేస్తారు.