RBI | న్యూఢిల్లీ, జనవరి 3: ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించే వీలుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. దీంతో రాబోయే మూడు ద్రవ్యసమీక్షలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. జూన్‌కల్లా రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు (అర శాతం) తగ్గవచ్చని అమెరికాకు చెందిన బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ చెప్తున్నది. దీంతో ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లో ఆర్బీఐ జరిపే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంటున్నది.
దాదాపు రెండేండ్లుగా రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను ఆర్బీఐ యథతథంగానే ఉంచుతున్నది. 2023 ఫిబ్రవరిలో చివరిసారిగా వడ్డీరేట్లను సెంట్రల్ బ్యాంక్ సవరించింది. రెపోరేటును గరిష్ఠంగా 6.5 శాతానికి తీసుకెళ్లింది. ఇక అప్పట్నుంచి అది అక్కడే ఉంటున్నది. కరోనా సమయంలో దిగాలుపడిన దేశ జీడీపీని ఉత్సాహపర్చేందుకు వడ్డీరేట్లను బాగా తగ్గించిన ఆర్బీఐ.. ఆ తర్వాత ద్రవ్యోల్బణం అదుపునకు అంతే స్థాయిలో పెంచుకుంటూపోయింది. ఇప్పటికీ ద్రవ్యోల్బణం గణాంకాలు ఆర్బీఐ ఆమోదయోగ్య స్థాయిని మించే నమోదవుతుండటంతో వరుస ద్రవ్యసమీక్షలను వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ముగిస్తూ వచ్చేశారు. అయితే ఇప్పుడు వడ్డీరేట్ల కోతకు వేళైందన్న అభిప్రాయాలు అంతటా వినిపిస్తున్నాయి. పైగా ఆర్బీఐకి కొత్త గవర్నర్‌గా శక్తికాంత దాస్ స్థానంలో సంజయ్ మల్హోత్రా రావడం, ఫిబ్రవరి ద్రవ్యసమీక్ష ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుండటం కూడా ఈసారి మీటింగ్‌పై సహజంగానే అంచనాలు పెరిగాయి.
గత నెల డిసెంబర్లో నిర్వహించిన ద్రవ్యసమీక్షలోనే దాస్.. ఆర్బీఐ ఇన్నాళ్లూ అవలంభిస్తూ వస్తున్న కఠిన ద్రవ్య వైఖరికి గుడ్‌బై చెప్పిందన్న సంకేతాలిచ్చారు. ఇకపై న్యూట్రల్ పాలసీ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో ద్రవ్యోల్బణం, జీడీపీల ఆధారంగా వడ్డీరేట్ల పెంపు, తగ్గింపులుంటాయని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే వడ్డీరేట్లు గరిష్ఠ స్థాయిల్లోనే ఉండటంతో ఇక తగ్గింపు తప్ప, పెంపునకు ఆస్కారం లేదన్న వాదనలున్నాయి. దీంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో కోతలేనన్న అంచనాల్ని వేస్తున్నారు. అదీగాక నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని 50 బేసిస్ పాయింట్లు గత సమీక్షలోనే తగ్గించారు. ఫలితంగా ఈసారి రెపోరేటు కోతలుండవచ్చని అంటున్నారు.
వడ్డీరేట్లను తగ్గించాలని వాహన, నిర్మాణ రంగాల నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిళ్లు గతకొంతకాలంగా పెరుగుతున్నాయి. ఈఎంఐల భారంతో రుణగ్రహీతలు, అధిక వడ్డీల భయంతో కొనుగోలుదారులు ఆందోళనలో ఉన్నారని ఆయా రంగాలు చెప్తున్నాయి. ఇక దేశ జీడీపీ వృద్ధిరేటుపై అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీరేట్లు తగ్గితే ఆయా రంగాలను ప్రోత్సహించినట్టు అవుతుందని ప్రభుత్వ పెద్దలు సైతం భావిస్తున్నారు. దీంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్ల కోతలకే వీలుందన్న అభిప్రాయాలున్నాయి. పైగా ఇబ్బందుల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ల వృద్ధికీ వడ్డీరేట్లు కలిసొస్తాయని చెప్తున్నారు. మొత్తానికి కొత్త గవర్నర్ అధ్యక్షతన కూర్చునే ద్రవ్య విధాన కమిటీ ఏం నిర్ణయిస్తుందోనన్న టెన్షన్ నెలకొన్నది.