వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులు దేశంలో కరెంటు కష్టాలకు దారితీయనున్నాయా? విద్యుదుత్పత్తి ఖర్చులు పెరిగి సామాన్యుల దగ్గర్నుంచి వ్యాపార-పారిశ్రామిక, వ్యవసాయ రంగాలదాకా చార్జీల భారం పడనున్నదా? కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తే ఇంతేనన్న అంచనాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. బొగ్గుపై వస్తు, సేవల పన్ను భారం త్వరలో ఏకంగా 13% పెరుగుతున్నది. ప్రస్తుతం 5 శాతం శ్రేణిలో ఉన్న బొగ్గుపై.. కొత్త విధానంలో 18 శాతం జీఎస్టీ రేటు పడబోతున్నది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నార
జీఎస్టీ విధానంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులు దేశంలో కరెంటు కష్టాలకు దారితీయనున్నాయా? విద్యుదుత్పత్తి ఖర్చులు పెరిగి సామాన్యుల దగ్గర్నుంచి వ్యాపార-పారిశ్రామిక, వ్యవసాయ రంగాలదాకా చార్జీల భారం పడనున్నదా? కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తే ఇంతేనన్న అంచనాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి మరి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు గొప్పగా చెప్పుకుంటున్న జీఎస్టీ సంస్కరణలతో దేశవ్యాప్తంగా కరెంటు కష్టాలు రావచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అవును.. బొగ్గుపై వస్తు, సేవల పన్ను భారం త్వరలో ఏకంగా 13 శాతం పెరుగుతున్నది మరి. ప్రస్తుతం 5 శాతం శ్రేణిలో ఉన్న బొగ్గుపై.. కొత్త విధానంలో 18 శాతం జీఎస్టీ రేటు పడబోతున్నది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానుండగా.. థర్మల్ విద్యుదుత్పత్తి ఖరీదెక్కడం ఖాయంగానే కనిపిస్తున్నది.
ప్రస్తుతం దేశీయ విద్యుత్తు అవసరాల్లో 50 శాతానికిపైగా బొగ్గు ఆధారిత విద్యుదుత్పాదక కేంద్రాల ద్వారానే తీరుతున్నాయి. సౌర, జల, పవన తదితర వనరుల ద్వారా మిగతా అవసరాలను తీర్చుకుంటున్నాం. ఈ క్రమంలో జీఎస్టీ భారం అమాంతం దాదాపు మూడు రెట్లు పెరిగితే థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలు ఒత్తిడికి గురవుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతిమంగా ఆ భారం వినియోగదారులపైనే పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇది యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం అని హెచ్చరిస్తుండటం గమనార్హం. సామాన్యులతోపాటు వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక రంగాలు ప్రభావితం అవుతాయని అంటున్నారు. ఉత్పాదక వ్యయం పెరిగి వస్తూత్పత్తుల ధరలు ఎగబాకితే ద్రవ్యోల్బణం విజృంభిస్తుందని, దీంతో కఠిన ద్రవ్య విధానాలు, జీడీపీ పతనం వంటివి సంభవిస్తాయని వివరిస్తున్నారు. కాగా, దేశీయంగా థర్మల్ విద్యుదుత్పత్తితో కాలుష్యం పెరుగుతున్నదని, అందుకే దానిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కేంద్రం చూస్తున్నట్టు చెప్తున్నారు. కాబట్టే జీఎస్టీ పెంపు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే థర్మల్ విద్యుదుత్పత్తిని ఇలా తగ్గించడం సరికాదన్న అభిప్రాయాలను ఇప్పుడు మెజారిటీ వర్గాలు వెలిబుచ్చుతున్నాయి.
ప్రస్తుతం బొగ్గుపై 5 శాతం జీఎస్టీ, టన్నుకు రూ.400 చొప్పున నష్టపరిహార సెస్సు (40%) అమలవుతున్నది. అయితే ఈ సెస్సుకు స్వస్తి చెప్పాలని జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేసింది. దీంతో 18 శాతం జీఎస్టీ పడినా ఇప్పటితో చూస్తే ఏమంత భారం ఉండబోదని కేంద్రం వాదిస్తున్నది. అయితే జీఎస్టీ రాకతో తమ ఆదాయం కోల్పోయామని, నష్టపరిహార సెస్సును మరో ఐదేండ్లు పొడిగించాలని చాలా రాష్ర్టాలు డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి వచ్చే ఏడాది మార్చి 31తో ఈ సెస్సు కాలపరిమతి తీరిపోనుండగా, ఈ ఏడాది ఆఖరుకల్లా దాన్ని తీసేయాలని కేంద్రం చూస్తున్నది. ఇలా ఇప్పటికైతే ఈ సెస్సుపై అస్పష్టతే నెలకొన్నది. ఈ నేపథ్యంలో బొగ్గుపై జీఎస్టీని పెంచడం సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నదిప్పుడు.
ఈ పరోక్ష పన్ను రేట్ల సవరణలతో వినియోగదారులపై పరోక్షంగా భారమే పడుతుందని ఢిల్లీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ టీకే అరుణ్ అభిప్రాయపడ్డారు. బొగ్గుపై జీఎస్టీని పెంచడమేగాక, పైప్లైన్ ద్వారా ముడి, రిఫైన్డ్ ఉత్పత్తుల రవాణా సేవలపై పన్నును 12 నుంచి 18 శాతానికి తీసుకెళ్లడం అనేక రకాల నష్టాలకు దారి తీస్తుందన్నారు.
కొత్త జీఎస్టీ విధానంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతిదారులకు నేరుగాగానీ, తక్షణమే దక్కిన ఊరటేమీ లేదు. అమెరికా సుంకాలతో ప్రభావితమవుతున్నప్పటికీ ఈ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.
– అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి
విమానాల్లో నాన్-ఎకానమీ టిక్కెట్లపై జీఎస్టీ భారాన్ని పెంచడం నిరాశపర్చింది. బిజినెస్, ప్రీమియం క్లాసుల్లో ప్రయాణించేవారి నుంచి వచ్చే ఆదాయానికి భారత ప్రభుత్వ నిర్ణయం గండి కొట్టేలా ఉన్నది.
– అంతర్జాతీయ విమాన రవాణా సంఘం
జీఎస్టీ సంస్కరణల వల్ల తగ్గిన పన్ను రేట్లతో కలిగే ప్రయోజనాలను వినియోగదారులకే బదిలీ చేస్తాం. ఇప్పుడున్న స్లాబులను 4 నుంచి 2కు కుదింపుతో వస్తు, సేవలు మరింత అందుబాటు ధరల్లోకి వచ్చాయి.
– ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్
జీఎస్టీ సంస్కరణల్లో వస్త్ర పరిశ్రమకు పన్ను ఊరట దక్కింది అంతంతే. రూ.2,500కుపైగా ధర కలిగిన దుస్తులపై జీఎస్టీని 18 శాతానికి పెంచడం మధ్యతరగతి కస్టమర్లను దూరం చేస్తున్నది.
– దేశీయ రిటైలర్స్, వస్త్ర తయారీదారుల సంఘాలు
వ్యాపారులు, తయారీదారులు, పరిశ్రమలు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందేలా చూడాలి. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఫలితం దక్కుతుంది.
-పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి
మారిన జీఎస్టీ విధానానికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కోసం ఇండస్ట్రీతో కలిసి పనిచేస్తాం. ఇప్పటికే ఆ దిశగా ముందుకెళ్తున్నాం. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) గురించిన భయాందోళనలు, సందేహాలు అక్కర్లేదు.
-సంజయ్ కుమార్ అగర్వాల్, సీబీఐసీ చైర్మన్