న్యూఢిల్లీ, జనవరి 10: బంగారం భగ..భగ మండుతున్నది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పుత్తడి ధర మరో రికార్డుకు చేరువకాబోతున్నదా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. ఇప్పటికే 2025లో రికార్డు స్థాయిలో దూసుకుపోయిన గోల్డ్ ధర..2026లోనూ అదే ట్రెండ్‌ను కొనసాగించనున్నదని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకోవడంతో దేశీయంగా ధరలు హీటెక్కుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పదిగ్రాముల బంగారం ధర రూ.1.41 లక్షల స్థాయిలో కదలాడుతున్న ధర ఈ ఏడాది జూన్ నాటికి రూ.2 లక్షలకు చేరుకునే అవకాశాలు మెండుగావున్నాయని వ్యాపార వేత్తలు అంచనావేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ప్రస్తుతం 4,500 డాలర్ల స్థాయిలో ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి 5 వేల డాలర్లను తాకే అవకాశాలున్నాయని హెచ్ఎస్బీసీ కమోడిటీ అంచనావేస్తున్నది. దీంతో దేశీయంగా ధరలు రూ.2 లక్షలు తాకిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వారు పేర్కొంటున్నారు. గత నెల చివర్లో గోల్డ్ ధర నూతన గరిష్ఠాలను తాకిన విషయం తెలిసిందే. 1979 నుంచి ఇప్పటి వరకు ఒకే ఏడాది భారీగా పెరిగిన ధర 2025లో 64 శాతం రిటర్నులు పంచింది. అలాగే 2023 నుంచి ఇప్పటి వరకు 140 శాతం ఎగబాకింది. 2025లో పలు దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు 900 నుంచి 950 టన్నుల మేర పసిడిని కొనుగోళ్లు చేశాయి. దీంతో గతేడాది గోల్డ్ డిమాండ్ 4,850 మెట్రిక్ టన్నులకు చేరుకున్నది. 2011 తర్వాత ఒకే ఏడాది ఇంతటి స్థాయిలో డిమాండ్ నెలకొనడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బంగారం ధరలు ఈ ఏడాది చివర్లో తిరోగమన బాటపట్టే అవకాశాల కూడా లేకపోలేవని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెరుగుట..విరుగుటకేనని వారు అంటున్నారు. గడిచిన ఏడాదికాలంలో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న గోల్డ్ ధర శాంతించే అవకాశాలు కూడా ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.
రికార్డు స్థాయికి చేరుకున్న ధరల కారణంగా ఆభరణాల విక్రయ దుకాణాలు వెలవెలబోతున్నాయి. గత పండుగ సీజన్లో కొంతలో కొంత అమ్మకాలు జరిగినప్పటికీ ప్రస్తుతం కొనేవాడు కరువయ్యారని వారు వాపోతున్నారు. ఈ ధరలను చూసి సామాన్యులు ఇటువైపు రావడానికి జంకుతున్నారని ఓ దుకాణదారుడు వెల్లడించారు.
రికార్డు స్థాయికి చేరుకున్న ధరల కారణంగా సామాన్యుడు వీటి స్థానంలో రోల్డ్‌గోల్డ్ ఆభరణాలకు మొగ్గుచూపుతున్నారు. ఫంక్షన్ వచ్చిన..పండుగ వచ్చిన వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గడిచిన ఆరు నెలల్లో వీటి విక్రయాలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ప్రధానంగా ఆభరణాల విక్రయ సంస్థలే వీటిని అమ్మకానికి పెడుతున్నాయి అంటే మార్కెట్లో వీటి డిమాండ్ ఎలావుందో అర్థమవుతున్నది.