Buildnow | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అనుమతులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం కోసం కొత్తగా అమల్లోకి తెచ్చిన ‘బిల్డ్ నౌ’ విధానంపై రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత వరకు కదలికలు లేవు. ఇందుకు సంబంధించి అధికారుల్లో ఎలాంటి కదలికలు లేవు. సింగిల్ పోర్టల్ విధానానికి సంబంధించి విధి విధానాలు, దరఖాస్తుల పద్ధతి, అనుమతులు ఇవ్వడం వంటి విషయాలపట్ల ఇప్పటి వరకు క్షేత్ర స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తి కాలేదు.
దీంతో కొత్త విధానం అమలుపై అప్పుడే అనుమానాలు కలుగుతున్నాయి. రియల్ అనుమతుల కోసం సింగిల్ పోర్టల్ విధానం తీసుకువస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందే కాని.. దానిని అమలు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. ముఖ్యంగా ఆయా మున్సిపాలిటీల పరిధిలో పని చేసే ఆర్కిటెక్చర్లు, అధికారులు, టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఇవ్వాల్సిన శిక్షణ కూడా ఇవ్వలేదని తెలిసింది. ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ అనుమతుల విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడం కోసం ‘బిల్డ్ నౌ’ పేరుతో సింగిల్ పోర్టల్ విధానం తీసుకువచ్చామని, ఈ కొత్త విధానాన్ని ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి తెస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు గతంలో ప్రకటన చేశారు.
యూబీఎస్ జీసీసీ విస్తరణ
హైదరాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ): స్విట్జర్లాండ్‌కు చెందిన అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ యూబీఎస్.. వచ్చే రెండేండ్లలో హైదరాబాద్‌లోని తమ జీసీసీ సామర్ధ్యాన్ని రెట్టింపు చేయనున్నట్లు, దీనివల్ల అదనంగా 1800 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. యూబీఎస్ ఇండియా చైర్మన్ హెరాల్డ్ ఎగ్గర్ శనివారం జ్యూరిచ్‌లో మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన చేశారు. ఐటీతోపాటు వ్యాపార సేవల్లో తెలంగాణను మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణ యం దోహదం చేస్తుందని ఆయన చెప్పా రు. ఇక్కడి ప్రతిభకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.