Starlink | ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ శాటిలైట్ ఆధారి ఇంటర్నెట్ సేవలో త్వరలో భారత్‌లో మొదలుకానున్నాయి. సేవలను ప్రారంభించేందుకు స్టార్‌లింక్ తుది ఆమోదాన్ని పొందింది. ఇప్పటికే స్టార్‌లింక్ సేవలు 100 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. లైవ్ స్కై వ్యూతో ఎక్కడైనా సేవలు పని చేయనున్నాయి. దాంతో భారత్‌లో అత్యంత మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రానున్నది. IN-SPACE (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్) భారతదేశంలో ఐదు సంవత్సరాల పాటు వాణిజ్య కార్యకలాపాల కోసం స్టార్‌లింక్‌కు ఆమోదం తెలిపింది. 2030 జులై 7 వరకు చెల్లుబాటు కానున్నది.
కంపెనీ జెన్-1 ఉపగ్రహాల ద్వారా సేవలను అందించనున్న భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అనుమతి పొందిన మూడో కంపెనీగా స్టార్‌లింక్ నిలిచింది. ఇంతకు ముందు వన్‌వెబ్, జియోకు అనుమతి లభించింది. లైసెన్స్ మంజూరైనప్పటికీ స్టార్‌లింక్ ఇంకా గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించాల్సి ఉంటుంటి. అలాగే స్పెక్ట్రమ్‌ను పొందడంతో పాటు భద్రతా స్టాండర్డ్ తనిఖీలను సైతం పూర్తి చేయాల్సి ఉంటుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాదిలోనే స్టార్‌లింక్ సేవలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. స్టార్‌లింక్ ఫైబర్ ఆప్టిక్ వంటి గ్రౌండ్-ఆధారిత మౌలిక సదుపాయాలపై ఆధారపడి నడవదు. వేలకొద్ది ఉపగ్రహాల నెట్వర్క్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ అందుతుంది. ఇవి లేజర్ ద్వారా ఒకదానితో అనుసంధానమవుతాయి. వేగంగా ఇంటర్నెట్ను అందిస్తుంది.
స్టార్‌లింక్‌తో జియో ఒప్పందం కుదుర్చుకుంది. రిటైల్ స్టోర్లలో డివైజ్‌లను విక్రయించాలని యోచిస్తున్నది. మారుమూల ప్రాంతాలలో ఇంటర్నెట్ అందించడానికి స్టార్‌లింక్‌తో సైతం ఎయిర్టెల్ ఒప్పందం చేసుకుంది. భారతదేశంలో స్టార్‌లింక్ బీఎస్ఎన్ఎల్ ‘డైరెక్ట్ టు డివైజ్’ పేరుతో పోటీ ఇస్తున్నది. శాటిలైట్, మొబైల్ నెట్‌వర్క్‌లను కనెక్ట్ చేయడం ద్వారా ఆండ్రాయిడ్ డివైజ్‌లలో నేరుగా ఇంటర్నెట్ అందించే సేవలపై కంపెనీ పని చేస్తున్నది. ఈ సాంకేతికతతో మారుమూల ప్రాంతాల్లోనూ మొబైల్ కనెక్టివిటీ సమస్యను పరిష్కారం కానున్నది. ఇదిలా ఉండగా.. స్టార్‌లింక్ హార్డ్‌వేర్ కిట్ (స్టాండర్డ్) రూ.30వేలు, హార్డ్‌వేర్ కిట్ (మినీ) రూ.43వేలు, ప్రమోషనల్ ప్లాన్ నెలకు రూ.900, అన్లిమిటెడ్ ప్లాన్ నెలకు రూ.3వేల వరకు ప్యాకేజీ ధర నిర్ణయించినట్లు తెలుస్తున్నది.