Indian Rupee | ముంబై, ఆగస్టు 3: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్నది. ఫారెక్స్ మార్కెట్లో వరుస పతనాల నడుమ దేశీయ కరెన్సీ వెలవెలబోతున్నదిప్పుడు. దాదాపు 6 నెలల్లో ఎప్పుడూ లేనంతగా బుధవారం ఒక్కరోజే 45 పైసలు క్షీణించిన రుపీ విలువ.. గురువారం కూడా అదే బాటలో పయనించింది. మరో 7 పైసలు కోల్పోయి 82.74 వద్ద నిలిచింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవడం, విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను భారతీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి అదేపనిగా ఉపసంహరిస్తుండటం.. ఫారెక్స్ మార్కెట్‌నూ ప్రభావితం చేస్తున్నదని నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయ క్రూడ్ మార్కెట్ సైతం రుపీని కుంగదీస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం ఉంటుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.