TCS | ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో నిత్యం కొత్త ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కానీ కరోనా మహమ్మారి తర్వాత టెక్నాలజీ రంగంలో బిజినెస్ వల్ల ఏటా జరగాల్సిన నియామకాలు నిలిచిపోయాయి. దీనికి కారణం గ్రాడ్యుయేట్లు, ఐటీ ఇంజినీర్లలో పరిశ్రమ అవసరాలకు సరిపడా ప్రతిభా పాటవాలు లేకపోవడమేనని తెలుస్తోంది. నైపుణ్య లేమి వల్లే టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజాలు ఉద్యోగుల ఎంపికలో కష్ట పడుతున్నాయని సమాచారం. వాస్తవంగా దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో 80 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం తమకు పెద్ద సవాల్‌గా మారిందని టీసీఎస్ రీసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ) గ్లోబల్ ఆపరేషన్స్ అధిపతి అమర్ షెటి చెప్పారు. అవసరమైన ఉద్యోగుల భర్తీకి కాంట్రాక్టు సంస్థలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ఉద్యోగుల నైపుణ్యాలు కంపెనీ చేపట్టే ప్రాజెక్టుల అవసరాలకు సరిపోలడం లేదని తేలింది.
టీసీఎస్తోపాటు పలు ఇండియన్ ఐటీ కంపెనీలు ఫ్రెషర్ ఇంజినీర్ల నియామకం ఆలస్యం చేస్తున్నాయి. రెండేండ్లుగా నియామక ఉత్తర్వులు ఆలస్యం కావడంతో 10 వేల మంది ఫ్రెషర్లపై ప్రభావం పడిందని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ (ఎన్ఐటీఈఎస్) నివేదిక పేర్కొంది. టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐటీ ఇంజినీర్లలో నైపుణ్య లోపమా.. వేతనాల్లో అంతరాయమా? అని ప్రశ్నిస్తున్నారు. భారత్ ఐటీ దిగ్గజాల కంటే ఇతర ఐటీ సంస్థల్లో ఇంజినీర్లు అధిక వేతనానికి నియమితులవుతున్నారని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. నైపుణ్యం లేని ఎగ్జిక్యూటివ్‌లు.. ఫ్రెషర్ల స్కిల్స్ పెంచడానికి సుముఖంగా లేరన్న విమర్శ ఉందని, అందుకే గ్రాడ్యుయేట్ యువతలో నిరుద్యోగానికి కారణం అని మరో నెటిజన్ తెలిపారు.