India-EU : ఇండియా-ఈయూ మధ్య సోమవారం చారిత్రక ట్రేడ్ డీల్ కుదిరిన సంగతి తెలిసిందే. ఇది స్వేచ్ఛాయుత ఎగుమతులు, దిగుమతులు దోహదపడుతుంది. ఈ డీల్ వల్ల అటు యూరప్‌లో, ఇటు ఇండియాలో అనేక ఉత్పత్తులు, సేవల ధరలు తగ్గే అవకాశం ఉంది. యూరప్ నుంచి దిగుమతి చేసుకునే వాటిపై పన్నులు తగ్గుతాయి. దీంతో ఈయూ నుంచి దిగుమతి చేసుకునే చాలా ఉత్పత్తులు మనకు చౌకగా లభిస్తాయి.
ప్రధానంగా ధరలు తగ్గే అవకాశం ఉన్న ఈయూ ఉత్పత్తులివి. లగ్జరీ కార్లపై ప్రస్తుతం 70-110 శాతం పన్నులు ఉన్నాయి. కానీ, కొత్త డీల్ ప్రకారం 40 శాతం వరకు మాత్రమే పన్నులు ఉంటాయి. అంటే లగ్జరీకార్లు అయిన బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, వోక్స్ వాగన్, రెనాల్ట్ వంటి కార్ల ధరలు తగ్గుతాయి. లగ్జరీ క్లాతింగ్ బ్రాండ్స్, లెదర్ ఉత్పత్తులు అంటే ఎక్కువగా యూరప్ ప్రొడక్టులే ఉంటాయి. ప్రస్తుతం వీటిపై 10 శాతం వరకు పన్ను ఉంటే.. కొత్త డీల్ ప్రకారం ఈ పన్నులు తగ్గుతాయి లేదా పూర్తిగా తొలగిస్తారు. దీంతో దుస్తులు, పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్స్, వాచీలు వంటి వాటి ధరలు తగ్గుతాయి. అలాగే వైన్ ఆల్కహాల్ ఉత్పత్తులపై ప్రస్తుతం 150 శాతంపైగా పన్నులు విధిస్తున్నారు. ఇకపై వాటిపై 10 శాతం వరకే పన్నులు ఉంటాయి.
అంటే ఆల్కహాల్ ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గుతాయి. అలాగే కొన్ని రకాల ఔషధాలు, కెమికల్స్ ధరలు కూడా తగ్గుతాయి. మన దగ్గర యూరప్ చాక్లెట్స్, పాస్తా, నూడిల్స్, డ్రింక్స్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ బాగా సేలవుతుంటాయి. వీటిపై ప్రస్తుతం 50 శాతం పన్నులు ఉండగా.. ఈ పన్నుల్ని భారీగా తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం చేస్తారు. దీంతో ఈ ఆహారోత్పత్తుల ధరలు కూడా అందుబాటులోకి వస్తాయి. వీటితోపాటు మనం దిగుమతి చేసుకునే ఆలివ్ ఆయిల్, ఫ్రూట్ జ్యూస్‌ల ధరలు కూడా తగ్గుతాయి.