రవి.. ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగి. నెలకు ఆకర్షణీయమైన జీతంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలనూ సంస్థ కల్పిస్తోంది. ముఖ్యంగా తనకు, తన భార్య, పిల్లలకు కూడా ఆరోగ్య బీమా అందుతూ ఉండటంతో ఇక భరోసాగా ఉన్నాడు. ఒకసారి తన భార్యకు జబ్బు చేసింది. 15 రోజులపాటు దవాఖానలోనే ఉన్నారు. తీరా కంపెనీ ఇచ్చిన రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఏ మూలకూ సరిపోలేదు. చేతి నుంచి గట్టిగానే ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది.
మనలో కూడా చాలామంది కంపెనీ ఇచ్చే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో జాయిన్ కావడంతో ఇక చాల్లే అనుకుంటారు. అయితే కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగేకొద్దీ, వయసు మీద పడేకొద్దీ మీ కంపెనీ హెల్త్ కవరేజీ ఏ మాత్రం సరిపోతుందో లెక్కేసుకుంటున్నారా?.. మన హెల్త్‌కేర్ పోర్ట్‌ఫోలియో కావాల్సినంత ఉందా?.. లేదా?.. అని చూసుకున్నారా?..
వ్యక్తిగత పాలసీ..
ఇవి మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీ అవసరాన్నిబట్టి ఎప్పటికప్పుడు హెల్త్ కవరేజ్ తీసుకోవచ్చు. సింగిల్‌గా ఉన్నప్పుడు తక్కువ మొత్తాన్ని, ఫ్యామిలీ పెరుగుతున్నప్పుడు ఎక్కువ మొత్తంతో కవరేజీని పెంచుకోవచ్చు. ఈ పాలసీలో క్యాష్‌లెస్ క్లెయిములకు స్కోప్ ఎక్కువ. పాలసీ కొనేందుకు చెల్లించే ప్రీమియానికి ఐటీ మినహాయింపునూ పొందవచ్చు. ముందుగా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి కవర్ కావడానికి కనీసం 3-5 ఏండ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మెటర్నిటీ ఖర్చులు కవర్ కావాలంటే అధిక ప్రీమియం చెల్లించాలి. వయస్సునుబట్టి పాలసీ తీసుకోవడానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే..
సాధారణంగా కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతతోపాటు పన్ను మినహాయింపుల కోసం గ్రూప్ మెడికవర్ పాలసీలను ఇస్తూ ఉంటాయి. కంపెనీ స్థాయి, చెల్లించే ప్రీమియం ఆధారంగా ఒక్కో ఉద్యోగికి రూ.2-5 లక్షల మధ్య హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఆఫర్ చేస్తూంటాయి. ఇందుకు అవసరమైన ప్రీమియంను అధిక సందర్భాల్లో కంపెనీలే చెల్లిస్తాయి. ఇక వీటిల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. మన కుటుంబ సభ్యులతోపాటు మనపై ఆధారపడిన తల్లిదండ్రులకు కూడా కవరేజీ లభిస్తుంది. అదికూడా ప్రస్తుత వ్యాధులకు ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండానే ఉంటుంది చాలా సందర్భాల్లో. పాలసీ తీసుకునే దాన్నిబట్టి మెటర్నిటీ కవరేజ్ కూడా వీటిల్లో ఉంటుంది. కనుక ఉద్యోగులు రెండో ఆలోచన లేకుండా ఈ గ్రూప్ హెల్త్ కవర్‌పైనే ఆధారపడతారు.
ఇక వీటిల్లో ప్రతికూలతల్ని చూస్తే.. ఈ పాలసీలకు కంపెనీ డబ్బు చెల్లిస్తుంది కాబట్టి సాధ్యమైనంతగా తక్కువ యాడ్ ఆన్ కవర్స్ ఉండేలా చూసుకుని తక్కువ ప్రీమియం వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటుంది. దీనివల్ల అత్యవసర సందర్భాల్లో ఉద్యోగులు ఇబ్బందులు పడే వీలున్నది. ముఖ్యంగా క్రిటికల్ ఇల్నెస్ (హార్ట్ స్ట్రోక్, క్యాన్సర్) వంటి సందర్భాల్లో సదరు పాలసీ కవరేజ్ ఎంతవరకు సరిపోతుంది?. వీటిల్లో ఎక్కువ శాతం క్యాష్‌లెస్ కూడా ఉండదు. క్లెయిమ్స్ TPA ద్వారా ప్రాసెస్ చేయించుకోవాలి. మీరు ఏ రోజైతే ఉద్యోగం మానేస్తారో అప్పటి నుంచే మీరు ఈ పరిధిలోకి రారు. వయస్సుపైబడిన తర్వాత అప్పుడు మీరు సొంతంగా ఏదైనా పాలసీ తీసుకోవాలంటే అత్యధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఏం చేద్దాం?..
గ్రూప్ ఇన్సూరెన్స్ కింద కంపెనీ మనకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నప్పటికీ మనం కూడా మంచి మొత్తానికి వ్యక్తిగతంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అత్యుత్తమం. మారుతున్న జీవనశైలి కారణంగా ఎప్పుడు ఏ రోగం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. కనుక మనకూ, మన కుటుంబానికీ వ్యక్తిగతంగా ఓ హెల్త్ పాలసీ తప్పక ఉండాల్సిందే. సంస్థ మానేయగానే హెల్త్ ఇన్సూరెన్స్ పోతోందంటే అది ప్రమాదం. మీరు రిటైరైన తర్వాత అప్పుడు ఏదైనా పాలసీ తీసుకోవాలంటే తడిసి మోపెడవుతుంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో అధిక వయస్సు కారణంగా పాలసీ రిజెక్ట్ కూడా కావచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా మీకంటూ ప్రత్యేకంగా మంచి క్లెయిం సెటిల్మెంట్, సర్వీస్ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని ఎంపిక చేసుకుని బీమా తీసుకోండి. తక్కువ ప్రీమియంతో అయిపోతుందని తూతూమంత్రంగా తీసుకోవద్దు. ఈ రోజుల్లో అనారోగ్యంతో దవాఖానలో చేరితే ఎంత ఖర్చవుతోందో అవగాహన తెచ్చుకోండి. రూ.3-4 లక్షల కవరేజీతో ప్రయోజనం తక్కువని
గుర్తించండి.
-నాగేంద్ర సాయి కుందవరం