Elon Musk X-Blue Sky | టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సారధ్యంలోని ఎక్స్ (మాజీ ట్విట్టర్) నుంచి యూజర్లు భారీగా వైదొలుగుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ నుంచి సుమారు 10 లక్షల మంది యూజర్లు నిష్క్రమించారు. ఎక్స్’ను వీడిన వారిలో ప్రముఖ జర్నలిస్టులు, సినీ నటులు, మ్యూజిషియన్లు, ఇతర ప్రముఖులు ఉన్నారు. ‘ఎక్స్’ను వీడుతున్న వారంతా ‘బ్లూస్కై’ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. అమెరికాలోని ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి బ్లూ స్కై యాప్ డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. సెప్టెంబర్ ప్రారంభంలో కేవలం పది లక్షల మంది యూజర్లు ఉన్న బ్లూస్కై ఇప్పుడు 19 లక్షల మందికి పెంచుకున్నది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్.. తన క్యాబినెట్లో వివేక్ రామస్వామితోపాటు ఎలన్ మస్క్ కు కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ సారధ్యం అప్పగించారు. ఇది చాలా మంది అమెరికన్లకు రుచించడం లేదు. ఎలన్ మస్క్ సారధ్యంలోని ఎక్స్ కేవలం రైట్ వింగ్ వాణి వినిపించడానికే పనికొస్తుందని నమ్ముతున్నారు.
దీనికి తోడు తాజాగా ఎక్స్ ప్రకటించిన టర్మ్స్ అండ్ కండీషన్స్ పాలసీ అప్ డేట్ కూడా మరో కారణం. ఈ నెల 15 నుంచి ఫోటోలు, పోస్టులు, వీడియోలు వాడుకుంటామని ఎక్స్ చేసిన ప్రకటనపై విభేదిస్తున్నారు. రాజకీయేతర కారణాల రీత్యా కూడా పలువురు యూజర్లు బ్లూ స్కైకి మళ్లుతున్నారు. ఎక్స్ (మాజీ ట్విట్టర్) మాజీ సీఈఓ జాక్ డోర్సీ 2019లో ఇంటర్నల్ ప్రాజెక్టుగా బ్లూ స్కై ప్లాట్ ఫామ్ ప్రారంభించారు. తొలుత ఇన్విటేషన్ ఆధారంగా సేవలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి తెచ్చారు. 2021లో జే గ్రాబర్ సీఈఓగా బ్లూ స్కై ఒక ఇండిపెండెంట్ కంపెనీగా అవతరించింది.