హైదరాబాద్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండకపోవడానికి చాలా కారణాలున్నాయి. భారత్ 86 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో ఉండదు కాబట్టి ధరలు పెరగడానికి అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు. అంతర్జాతీయస్థాయిలో డిమాండ్-సరఫరాకు అనుగుణంగా ధరలు మారు తుంటాయి. అయితే దేశీయంగా,అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరగడానికి కరోనా సంక్షోభం కూడా ఓ కారణమని వారు అంటున్నారు.
డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోతే ధరలు పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. చమురు రంగంపై ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల కూడా ధరలు ప్రభుత్వాల చేతిలో ఉండకపోవడానికి ఓ కారణం. పునరుత్పాదక, హరిత ఇంధనంపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ధరలు మరింత పెరిగి, 2023 నాటికి లీటర్ ముడి చమురు మరో రూ.100 పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.